27లోగా వాహనాలకు దరఖాస్తులు చేసుకోవాలి..
Ens Balu
3
Srikakulam
2020-11-21 17:51:42
శ్రీకాకుళం జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాలను సబ్సిడిపై మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఇందుకు ఈ నెల 27వ తేదీ నాటికి దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాల మంజూరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమీషనర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పేద కుటుంబములకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ఇళ్ళ వద్దకే నేరుగా పంపిణీ చేస్తున్న సంగతి విదితమేనని అన్నారు. సరుకు రవాణా వాహనాలను ప్రజాపంపిణీ వ్యవస్ధతో అనుసంధానం చేసి ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలు అందించుటకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో లబ్దిదారుని వాటా – 10 శాతం రూ.58,119., బ్యాంకు ఋణము - 30 శాతంగా రూ.1,74,357 కాగా సబ్సిడిగా 60 శాతం రూ.3,48,714/- ఉంటుందని వివరించారు. అర్హత గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో ఎంపిక జరపాలని ఆయన స్ఫష్టం చేసారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఎంపిక కమిటి ముందు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేసారు. వీటిపై మండల స్ధాయిలో నిరుద్యోగ యువతకు తగిన సమాచారం అందించాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల సరఫరాలోను, స్వీకరణలోనూ ఎటువంటి ఆరోపణలకు తావు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సర్వేలో భాగంగా మండలాల్లో ఉన్న నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలను కూడా సర్వే చేయాలని సూచించారు. ఏ ఒక్క పరిశ్రమను విడిచి పెట్టరాదని, స్పష్టమైన, వాస్తవమైన డేటా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, డిప్యూటి ట్రాన్సుపోర్టు కమీషనర్ వడ్డి సుందర్, జిల్లా సరఫరా అధికారి డి.వెంకట రమణ, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.