లబ్ధిదారుల ఎంపిక సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
2
Vizianagaram
2020-11-21 18:36:17
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ ఆర్.వెంకటరావు (ఆసరా) అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భీమా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల పురోగతిపై జేసీ వెంకటరావు, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ తో కలిసి బ్యాంకుల ప్రతినిధులతో, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పథకాల్లో చేరిన లబ్ధిదారుల వివరాలను, ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వైఎస్సార్ భీమలో లబ్ధిదారులను చేర్చే ప్రక్రియపై చర్చించారు. జిల్లాలో మొత్తం 6,97,161 మంది రైస్ కార్డ్ లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటి వరకు 5,92,908 మంది మాత్రమే చేరి ఉన్నారని జేసీ వెల్లడించారు. మిగతా వారిని త్వరితగతిన సర్వే చేసి చేర్చాలని మెప్మ, డి.ఆర్.డి.ఎ సిబ్బందిని ఆదేశించారు. 18 సం"రాలు కన్న తక్కువ వయస్సు, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ల వివరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు. వైఎస్సార్ భీమా, చేయూత, జగనన్న తోడు పథక ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలంటే ప్రతీ ఒక్కరికీ ఖాతా తెరవాలని చెప్పారు. ఖాతాలు తెరిచే విషయంలో ప్రభుత్వ సిబ్బందికి బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికల్లా ప్రతి లబ్ధిదారుకీ బ్యాంక్ ఖాతా తెరవాలని, సంబంధిత సమస్యలు ఉంటే పరిష్కరించి నివేదికలు అందజేయాలని సూచించారు. ఖాతాల తెరిచే నిమిత్తం బ్యాంకులకు పంపిన పెండింగ్ లిస్టును పరిష్కరించాలని చెప్పారు. అనంతరం వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల అమలుపై సమీక్షించి, తగిన సలహాలు సూచనలు అందజేశారు.
కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు, మేప్మా పి.డి. సుగుణ ఖర్ రావు, పశుసంవర్ధక శాఖ జె.డి. నరసింహులు, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, డి.ఎల్.డి.ఒ.లు రాజ్ కుమార్, రామచంద్రరావు, ఎస్బిఐ, ఐ ఓ బి, ఏపీజివీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.