ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి..
Ens Balu
2
Vizianagaram
2020-11-21 18:44:34
విజయనగరం జిల్లాలోని ప్రతీ మున్సిపాల్టీలో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. దీనిని నిర్మూలించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. మోనటరింగ్ ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై అన్ని మున్సిపాల్టీల కమిషనర్లతో కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం సమావేశం జరిగింది. ఆయా మున్సిపాల్టీల్లో చెత్త నిర్వహణ పద్దతులు, దీనికి తీసుకున్న చర్యలపై అంశాలవారీగా చర్చించారు. తమతమ మున్సిపాల్టీల్లో అవలంబిస్తున్న విధానాలను, తీసుకున్న చర్యలను కమిషనర్లు వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతికి తీరని హాని చేసే ప్లాస్టిక్ ను నిర్మూలించడంపై ప్రతీఒక్కరూ దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై బొబ్బిలి మినహా మిగిలిన మున్సిపాల్టీలపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆ తరువాత ప్లాస్టిక్‌ను విక్రయించేవారిపైనా, వినియోగించే వారిపైనా చర్యలు మొదలు పెట్టాలని సూచించారు. అన్ని మున్సిపాల్టీల్లో డిబ్రిస్ ను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీనిని అరికట్టేందుకు ఒక పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పారు. దీనికోసం డిసెంబరు 1 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆ నెలంతా ఎక్కడికక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను తొలగించి, దీనికోసం ఒక నిర్ణీత ప్రదేశాన్ని కేటాయించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా డెబ్రిస్ వేసేవారికి జనవరి నుంచి జరిమానాలు విధించడంతోపాటు, దానిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని సైతం వారివద్దనుంచే రాబట్టాలని చెప్పారు. సచివాలయాల్లో ఎంతో సామర్ధ్యమున్న సిబ్బంది మనకు అందుబాటులో ఉన్నారని, వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమాచారం త్వరగా అందించేందుకు, పనుల పర్యవేక్షణకు వీలుగా మున్సిపాల్టీల్లోని సచివాలయ సిబ్బందికి వాకీటాకీ హేండ్‌సెట్లు ఇవ్వాలని ఆదేశించారు. మొక్కలను నాటే కార్యక్రమం విజయనగరం కార్పొరేషన్ మినహా, మిగిలిన మున్సిపాల్టీల్లో ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పచ్చదనాన్ని పెంచడానికి, చెరువుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనికోసం ప్రతీ మున్సిపాల్టీలో ఒక ప్లాంటేషన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాల్టీల్లో నాడూ-నేడు పనులను వేగవంతం చేయాలని, ప్రతీచోట కనీసం ఒక పాఠశాలను నమూనా పాఠశాలగా ఎంపికచేసి, డిసెంబరు నాటికి అన్ని వసతులతో సిద్దం చేయాలని ఆదేశించారు. ఎక్కడబడితే అక్కడ ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని నివారించాలన్నారు. ముఖ్యప్రదేశాల్లో వివిధ ప్రాంతాలను తెలుపుతూ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రతీ ఒక్క అధికారీ సృజనాత్మకతతో ఆలోచించి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, సాలూరు కమిషనర్ ఎం.రమణమూర్తి, పార్వతీపురం కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, నెల్లిమర్ల నగర పంచాయితీ కమిషనర్ అప్పలనాయయుడు, సిబ్బంది పాల్గొన్నారు.