కారుణ్య నియమాల్లో విజయనగరం టాప్..
Ens Balu
1
Vizianagaram
2020-11-22 14:31:09
ఒకటీ..రెండు కాదు..ఏకంగా 66 మందికి తన హయాంలో కారుణ్య నియమాకాలు చేశారు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందితే, వారి కుటుంబాలు రోడ్డున పడకూడదని, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, వెంటనే ఆయా కుటుంబాలను ఆదుకోవాలన్న సమున్నత లక్ష్యంతో, కారుణ్య నియామకాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ, జిల్లాలో సరికొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగం కోసం ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఒక్కోసారి ఆయా కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కోసం ఏకంగా రెండుమూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. అయితే డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న ఖాళీలను, దాదాపు ప్రతీనెలా ఖాలీలను భర్తీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒకేనెలలో రెండుసార్లు కారుణ్య నియామకాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముందుగా అభ్యర్ధులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి అర్హతలు, ఆసక్తిని బట్టి కేవలం గంటలోనే నియామక పత్రాలు అందిస్తూ ఒక కొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టారు. 2018లో డాక్టర్ హరి జవహర్‌లాల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి ఇప్పటివరకు మొత్తం 66 మందికి కారుణ్య నియామకాలు జరిగాయి. వీటిలో 2018లో 21 మందికి, 2019లో 23 మందికి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మొత్తం 66 మందిలో 48 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 8 మందిని విఆర్ఓలుగా, 10 మందిని ఆఫీస్ సబార్డినేట్స్‌గా వారివారి అర్హతలను బట్టి నియమించారు. రెవెన్యూ, కార్మికశాఖ, సబ్ జైల్స్, రిజిష్ట్రేషన్ శాఖ, పంచాయితీశాఖ, ఆడిట్ విభాగం, ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్, జిల్లా ఖజానా, వ్యవసాయ మార్కెటింగ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విద్యాశాఖ, ఇంటలిజెన్స్, ఉద్యానశాఖ, సహకార శాఖ, మత్స్యశాఖ, తూనికలు కొలతల శాఖ, అటవీశాఖ తదితర ప్రభుత్వ విభాగాల్లో రోస్టర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు వీటిపై సమీక్షిస్తూ, దరఖాస్తులు వచ్చిన వెంటనే, వాటి భర్తీకి ఆదేశాలు ఇచ్చారు.
కుటుంబాలు రోడ్డున పడకూడదు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
సర్వీసులో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబాలు రోడ్డున పడకూదన్న మానవతా దృక్ఫథంతో, వారి వారసులకు వెంటవెంటనే కారుణ్య నియామకాలు చేస్తున్నాం. ఎంత త్వరగా మనం ఉద్యోగం ఇవ్వగలిగితే, అంత త్వరగా ఆ కుటుంబం ఆర్థికంగా కోలుకొనే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి వారసులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారి అర్హత, ఆసక్తిని బట్టి శాఖలను కేటాయించడం జరుగుతోంది. ఖాళీలపై వారంవారం సమీక్షి చేయడంతోపాటుగా, కౌన్సిలింగ్ చేసిన గంటలోనే జాయినింగ్ ఆర్డర్లను అందజేసి కొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టాం.