జిల్లాలో 50 ధాన్యం కొనుగోలు యేంద్రాలు ఏర్పాటు


Ens Balu
2
Bheemili
2020-11-22 16:44:20

విశాఖజిల్లా వ్యాప్తంగా 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు తెలియజేశారు. ఆదివారం భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో ఆదివారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు 17 శాతం  తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి  తీసుకొని వచ్చి మద్దతు ధర గ్రేడ్ వన్ 1888  రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు క్వింటాలుకు పొందాలని పేర్కొన్నారు. వైయస్సార్ భీమా ద్వారా రైతులు తుఫాన్ , వరదల వల్ల ఎంత నష్ట పోతే ..అంత పూర్తిగా నష్ట పరిహారాన్ని అతి తక్కువ కాలంలో అందిస్తున్న  ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు.  సున్నావడ్డీ పంట రుణాలకు సంబంధించి 927 మంది రైతులకు రూ. 16 లక్షలకు పైగా చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వై యస్ ఆర్ జలకళ  పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నట్లు, 'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం వెంకటాపురం లో వైఎస్సార్ జలకళ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత  విద్యుత్ పంపిణీ  సంస్థ ద్వారా వరల్డ్ బ్యాంక్ నిధులతో రూ. 45 లక్షలతో , మహారాజు పేట జంక్షన్ నుంచి రెవిడి సబ్ స్టేషన్ వరకు 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జి యన్ఎస్ లీలావతి, ఇతర అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.