వరం ఆశయాలను కొనసాగించాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-22 19:29:44

కీ.శే.అంధవరపు వరహా నరసింహం ఆశయాలను వారి కుటుంబసభ్యులు కొనసాగించాలని, వరం ఆశయసాధనకు కృషిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ఇంటాక్ ఆధ్వర్యంలో జరిగిన వరం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ వరం విభిన్నమైన శైలి కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. పదవులతోనే పేరు రాదని, ప్రజల అవసరాలను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న వ్యక్తి వరం అని, అందుకే ఈ అరుదైన గౌరవం ఆయనకు లభిస్తుందని చెప్పారు. ఎంత డబ్బులు ఉన్నప్పటికీ వాటితో ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేసే ధృక్పధం కొంతమందికే ఉంటుందని, ఆ ధాతృత్వం కలిగిన వ్యక్తి వరం అని కొనియాడారు. వరంతో తన కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని, చల్లా లక్ష్మీనారాయణ కాలం నుండి వారితో, వారి కుటుంబంతో అనుంబంధం ఉందని గుర్తుచేసారు. అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేనప్పటికీ విగ్రహ రూపంలో సజీవంగా ఉంచిన శిల్పిని అభినందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకశైలిలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఆశయ సాధనలో వరం కుటుంబసభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి సహాయం, సేవా కార్యక్రమాలు చేయడంలో వరం ముందుండే వారని, ఆయన ఆశయాలను వారి సంతానం కొనసాగించాలని చెప్పారు. వరం పేరుతో ట్రస్టు ఏర్పాటుచేస్తామని వారి కుమారులు, కుమార్తె తెలిపారని, ఆ ట్రస్టుతో వరం ఆశయసాధనకు కృషిచేయాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే కుటుంబంలోని వ్యక్తిగా తనను ఎప్పుడైనా కలవవచ్చని, వరం కుటుంబసభ్యులకు పూర్తి అండదండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వరం విగ్రహ రూపకర్త డా.డి.రాజ్ కుమార్ వుడయార్ ను దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.           విశిష్ఠ అతిథి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికే ఒక వరం లాంటివారు అంధవరపు నరసింహం అని కొనియాడారు. భౌతికంగా మనమధ్య లేనప్పటికీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుండి తరలివచ్చిన ప్రజానీకం సజీవంగానే మన మధ్య ఉన్నారని తెలియజేస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ జనన మరణాలు తప్పవని, అయితే మరణిస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచినవారు కొందరే ఉంటారని, అటువంటి వారిలో వరం ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. వరం రాజకీయాల్లో కొనసాగిన కాలంలో అందిరితో మంచి తత్సంబంధాలు కలిగి ఉండేవారని, ఆయన ఇచ్చిన సూచనలతో పనిచేసిన వారు ఎందరో ఉన్నారని గుర్తుచేసారు. మంచి వ్యక్తిగా, రాజకీయ దురంధురడిగా, వ్యాపారవేత్తగా, స్నేహితుడుగా, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన లక్షణాలు కలిగిన వ్యక్తి వరం అని పేర్కొన్నారు. చరిత్రకు నిజమైన తార్కాణం వరం అని, శారీరకంగా మన మధ్య లేనప్పటికీ శ్రీకాకుళం చరిత్ర ఉన్నంతవరకు వరం ఒకడిగా ఉంటారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్లేవాడని, నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలని అన్నారు. పనులు చేయించుకునే సమయంలో అందరిని ఒప్పించి పనులు జరుపుకునేవాడని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కె.రోశయ్యతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారని, ఎందరో ముఖ్యమంత్రులకు ఆతిధ్యమిచ్చిన వ్యక్తి వరం అని గుర్తుచేసారు. వరం ఆశీర్వచనాలు మనందరికీ ఎపుడూ ఉంటాయని , వారి ఆశయ సాధనకు వారి కుమారులు కృషిచేయాలని ఆకాంక్షించారు.           శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికి అనేక సేవలు అందించిన వ్యక్తిగా వరం ఎపుడూ గుర్తుంటారని అన్నారు. పట్టణంలో ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే అది వరంతోనే ప్రారంభం అయ్యేదని గుర్తుచేసారు. చల్లా లక్ష్మీనారాయణ సూచనలతో మునిసిపల్ ఛైర్మన్ గా పదవిని స్వీకరించారని, నాటి నుండి తిరుగులేని నేతగా ఎదగారని కొనియాడారు. వరం విలక్షణమైన వ్యక్తి అని, అందుకే ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలిపారు. ఏదైనా పనిజరగాలంటే ఆ పని జరిగేంత వరకు వదలిపెట్టేవాడు కాదని, మంచి నాయకుడికి ఆ లక్షణాలు తప్పనిసరి అని అన్నారు. వరం తయారుచేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, వారిలో కొందరు తమకు సన్నిహితంగా ఉన్న సంగతిని గుర్తుచేసారు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ పట్టణం కోసం కలిసి పనిచేసేవాళ్లమని, అలాగే వరం లేనప్పటికి వారి కుటుంబసభ్యులకు తమ సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలిపారు. పట్టణం నడిబొడ్డున డా. వై.యస్.రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వరం విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ప్రాధాన్యత సంతరించుకుందని, ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఏర్పాటుచేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.           ఈ కార్యక్రమంలో వరం కుటుంబ సభ్యులు  ప్రసాద్, సంతోష్, పైడి జయంతి, అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ఎచ్చెర్ల సూర్యనారాయణ, విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు, ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు, చల్లా అలివేలు మంగ, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, మత్స్యకార సంక్షేమ సంఘం ఛైర్మన్ మహాలక్షీ, కళింగ వైశ్య సంక్షేమ సంఘం విశాఖపట్నం, విజయనగరం అధ్యక్షులు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, సహ కన్వీనర్ సురంగి మోహనరావు, ట్రెజరర్ నటుకుల మోహన్, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.