అభయం యాప్ తో మరింత భద్రత..
Ens Balu
2
Srikakulam
2020-11-23 15:12:45
బాలలు, మహిళలకు ఒక అన్నగా భద్రత కల్పించాలనే ధ్యేయంతో పనికేగేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభయం యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బాలలు, మహిళల ప్రయాణ భద్రతకు యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రక్షణ, భద్రతలో ఎటువంటి రాజీ ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. దిశా చట్టాన్ని తీసుకు వచ్చామని అన్నారు. అక్కా,చెల్లెమ్మ లకు అండగా ఉంటామని చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బాలలు, మహిళలలు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆటో లపై నమ్మకం లేక యాప్ ఏర్పాటు చేయడం కాదు, మన ఆటో లపై నమ్మకం పెంచేందుకు, ధైర్యం ఇచ్చేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా అంతా మంచి జరగాలని ఆకాక్షించారు. రవాణా శాఖ కమీషనర్ ఎం.టి.కృష్ణ బాబు అభయం యాప్ పనితీరు వివరించారు. ఆటోలకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఐఓటి పరికరాన్ని, జిపిఎస్ విధానాన్ని అమర్చుతారని, వెబ్ అప్లికేషన్ సహాయంతో వాహనాలను పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. మొదటి విడతలో ప్రధాన నగరాలలో అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రయాణీకుల వద్ద అభయం యాప్ ఉండాలని అన్నారు. యాప్ ను యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి అభయం యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేనప్పటికి భద్రత పొందే అవకాశం యాప్ లో పొందుపరచడం జరిగిందని అన్నారు. ప్రయాణీకులు వాహనంలో ఎక్కుటకు ముందు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తరువాత వాహనం వివరాలు, డ్రైవర్ వివరాలు అందుబాటులోకి వస్తుందని వివరించారు. వాహనం బయలుదేరుటకు ముందు ప్రయాణీకులకు మూడు దారులను సూచిస్తుందని, ప్రయాణ వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందిస్తుందని అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు వాహనంలో ఉన్న పేనిక్ బటన్ నొక్కితే వివరాలు పర్యవేక్షణ విధానంలోకి వెళుతుందని అన్నారు. డ్రైవర్ ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వెళ్లాల్సిన రూట్ మార్చినా పేనిక్ బటన్ నొక్కితే వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుతుంది. అచ్చట నుండి సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందుతుందని, తక్షణ చర్యగా వాహనం ఇంజిన్ ఆగిపోయి, రక్షించండి అనే అరుపు వినిపిస్తుందని అన్నారు. తద్వారా వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. కోడ్ స్కాన్ చేయడం ద్వారా, రూట్ ను షేర్ చేయడం, భయం అనిపించిన సమయంలో బటన్ నొక్కడం (పేనిక్ బటన్) వంటి భద్రతా చర్యలు వలన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవచ్చని తెలిపారు. నిర్భయ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం అభయం ప్రాజెక్టును మంజూరు చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో నిధులను సమకూర్చుతాయి. అభయం ప్రాజెక్టు విలువ రూ.138.49 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ.83.09 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.55.39 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.58.64 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. 2021 నవంబరు మాసాంతానికి లక్ష ఆటోలను ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, డిప్యూటీ ట్రన్స్పోర్ట్ కమీషనర్ డా.వడ్డి సుందర్, ఎం.వి.ఐ వేణుగోపాల్, సిపిఓ ఎం.మోహన రావు తదితరులు పాల్గొన్నారు.