సత్యదేవుని సన్నిధిలో కార్తీక రద్దీ..
Ens Balu
3
Annavaram
2020-11-23 15:21:21
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నధిలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో వ్రతాలు చేయించుకున్నారు. వేకువ జామునుంచే స్వామివారి ఆలయం ఎదురుగా వున్న రావిచెట్టు వద్ద భక్తులు భారీగా బారులు తీరి కార్తీక దీపాలు అలంకరించారు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సత్య దేవుని కొండ భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుడుని దర్శించుకుంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే మొదటిసారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఈరోజు రికార్డు స్థాయిలో వ్రతాలు జరుగుతున్నా కార్తీకమాసంలో మాత్రం ఈ సంఖ్య మరింత అధికంగా వుంటుంది. అదే సమయంలో ఉపవాస దీక్షల్లో కూడా భక్తులు అధికంగా పాల్గొనడంతో ఎక్కువ మంది స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం దీక్ష పూర్తయిన తరువాత కూడా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారని చెబుతున్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రసాదాలు కూడా దేవస్థానం సిద్ధం చేసింది..