మహిళలకు తిరుగులేనిది ’అభయం‘యాప్..
Ens Balu
5
Vizianagaram
2020-11-23 16:25:44
మహిళలకు అభయం యాప్ ఒక అభయహస్తం లాంటిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, ఎస్‌పి బి.రాజకుమారి పేర్కొన్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని వారు కోరారు. అభయం ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. అభయం యాప్‌ను విడుదల చేశారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వారి ఆర్థిక, రాజకీయ స్వావలంబనకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని, వారు నిర్భయంగా ఆటోలు, టేక్సీల్లో ప్రయాణించేందుకే అభయం యాప్‌ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఏడాదిలోగా దశలవారీగా లక్ష పరికరాలను ఈ వాహనాల్లో అమర్చనున్నామని సిఎం ప్రకటించారు. అభయం ప్రాజెక్టు క్రింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక అభయం యాప్‌ను రూపొందించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా దశలవారీగా ఆటోలు, టేక్సీల్లో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. అభయం యాప్‌ను తమ స్మార్టుఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న మహిళలు, బాలికలు, ఆ వాహనం ఎక్కిన వెంటనే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆటో వివరాలు, డ్రైవర్ వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. అలాగే తాము ఎక్కిన ప్రదేశం నుంచి వెళ్లాల్సిన ప్రదేశానికి రూట్ మ్యాప్‌ను కూడా నమోదు చేసుకోవచ్చు. వెంటనే ఈ వివరాలు 112 పోలీస్ కంట్రోల్ రూముకు చేరతాయి. ఒకవేళ ఆటో ఆ రూటు కాకుండా, వేరే రూటులోకి వెళ్తే అలారం మ్రోగుతుంది. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ, ఈ మార్పును గమనిస్తే, వెంటనే ఆ పరికరంలో ఉన్న పానిక్ బటన్‌ను ప్రెస్ చేసినా అలారం మ్రోగుతుంది. వాహనానికి ఇంథన సరఫరా బంద్ అయి అది నిలిచిపోతుంది. కొద్దినిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకొనే విధంగా ఈ ప్రాజెక్టును, యాప్‌ను రూపొందించారు.
అనంతరం కలెక్టర్ హరి జవహర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ మహిళలు, బాలలికల ప్రయాణ భద్రతకు అభయం యాప్ ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోసారి ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ఈ యాప్ వారికి వరం లాంటిదని పేర్కొన్నారు. దశలవారీగా ఆటోలు, టేక్సీల్లో పరికరాలను బిగించడం జరుగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో పానిక్ బటన్‌ను నొక్కడం ద్వారా, ఆ పరిస్థితినుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో అభయం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ అభయం యాప్ మహిళలకు, బాలికలకు అభయహస్తాన్ని ఇస్తుందని అన్నారు. వారి భద్రతకు ఇది ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఇప్పటికే దిశ యాప్ కూడా ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. అభయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మహిళలు ఆత్మస్థైర్యాన్ని పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీ మహిళా ఉపయోగించుకోవాలని, సురక్షిత ప్రయాణం కోసం అభయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్‌పి కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాకు చెందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జెవివిఎస్ ప్రసాద్, ఎస్ఎల్ ప్రసాద్, ఎఎంవిఐలు ఎండి భషీర్, వి.దుర్గాప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.