మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
1
Visakhapatnam
2020-11-23 17:08:23
రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం అభయం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆయన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న అభయం ప్రాజెక్టును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల రక్షణ , భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని అన్నారు. రవాణా శాఖ పర్యవేక్షణలో నిర్వహించే ఈయాప్ ద్వారా మహిళలు, బాలికలు, ఆటోలు లేదా ఇతర ప్రజారవాణా వాహనాలలో ప్రయాణించేటప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో విశాఖపట్నం నుంచి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ , పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా , జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, డిటి సి రాజారత్నం , డిగ్రీ కళాశాల విద్యార్ధినులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి , జిల్లా కలెక్టర్ అభయం పోస్టర్ ను రిలీజ్ చేసారు. తరువాత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆటోర్యాలీని పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఒక అన్నగా వారి భద్రత ,రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోలు మరియు ఇతర ప్రజా రవాణా వాహనాల్లో అమరుస్తారని తెలిపారు. స్మార్ట్ ఫోన్ కలిగిన మహిళలు, ప్లేస్టోర్ ద్వారా అభయం మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని , తన మొబైల్ నెంబరుతో నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రయాణం మొదలైన తరువాత నమోదు చేసిన రూట్ లో కాకుండా , వేరే రూట్ కి వెళ్లినా లేక డ్రైవరు యొక్క చెడు ప్రవర్తన గుర్తించిన వెంటనే బటన్ నొక్కడం ద్వారా వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అలర్టు వెళుతున్నదని తెలిపారు. జి.పి.యస్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఆ మహిళలను రక్షించడం జరుగుతుందని అన్నారు.ఈయాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.