ఇళ్ళ స్థలాలను ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలి..
Ens Balu
1
Vizianagaram
2020-11-23 17:49:31
విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద డిసెంబర్ 25న ఇళ్ళ పట్టాలను అందజేస్తున్నందున ఆ లేఔట్లను మండల ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకాధికారులు మండలాల్లో సచివాలయాలతో పాటు ఇళ్ళ స్థలాలను కూడా తనిఖీ చేసి వాటి అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. సోమవారం స్పందన అనంతరం కలెక్టర్ జగనన్న తోడు, ఇళ్ళ పట్టాలు కన్వర్జెన్స్ పనులు, తదితర కార్యక్రమాల పై అధికారులకు పలు సూచనలు చేసారు. ఇళ్ళ కోసం వేసిన లేఔట్ల లో హద్దు రాళ్లు ఉన్నది లేనిది, బోర్డ్స్ డిస్ప్లే చేసింది లేనిది ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలనీ, అలాగే ప్రతి సైట్ లోను మొక్కలు నాటాలని, రహదారుల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కూడా జరగాలని ఆదేశించారు. అనవసర మొక్కలు, తుప్పలు ఉంటె వాటిని తొలగించాలని, అవసరమగు మొక్కల కోసం డుమా పి.డి లేదా అటవీ అధికారిని సంప్రదించాలని అన్నారు. స్థలాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసే బాధ్యత ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేసారు. లే ఔట్లలో వృధాలను తొలగించడానికి వాలంటీర్ , లబ్ది దారులను సమీకరించుకొని శ్రమదానం ద్వారా పని చేయించాలన్నారు. ప్రత్యేకాధికారులంతా వారి మండలాల్లోని లేఔట్ల పై నివేదికనివ్వాలని సూచించారు. జగనన్న తోడు దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలన్నారు. కన్వర్జెన్స్ పనులలో భాగంగా ఇప్పటికి ప్రారంభం కానీ రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, సచివాలయ భవనాలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కావాలని ఆదేశించారు. డుమా పి.డి ఈ విషయం లో సమన్వయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల సేకరణకు అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, అమూల్ కంపెనీ తో ఒప్పందం చేసుకొని రైతులకు పాడి ద్వారా లాభాలను చేకూర్చే కార్యక్రమం కావున ఈ నెలాఖరు నాటికి బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలకు స్థలం హ్యాండ్ ఓవర్ చేయాలని అన్నారు. ఇప్పటికే డిజైన్, ప్లానింగ్ వచ్చాయని, 34 మండలాల్లో గ్రామాల వారీగా గుర్తించిన స్థలాలను వెంటనే పశు సంవర్ధక శాఖ కు అప్పగించాలని సూచించారు. పాఠశాలలలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని జిల్లా విద్య శాఖాధికారి జి. నాగమణికి ఆదేశించారు. విద్యార్ధుల హాజరు పై ఆరా తీయాలని, పిల్లల్ని తల్లి దండ్రుల అంగీకారం తోనే పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కోవిడ్ ఉన్నదో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ద్వారా నివేదిక తీసుకొని, ఆ ప్రాంతాల్లో పిల్లలకు, ఉపాధ్యాయులకు కోవిడ్ సోకకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.