ఎం.ఎస్.ఎం.ఇలు ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
Ens Balu
4
Srikakulam
2020-07-29 14:53:00
సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలు(ఎం.ఎస్.ఎం.ఇలు) ఉద్యం రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్.ఎం.ఇలను తరగతి వారీగా నమోదు చేయు విధానాన్ని సరళీకృతం చేసి జూలై 1వ తేదీ నుండి ఉద్యం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇలు ఇప్పటి వరకు ఉద్యోగ్ ఆధార్ మెమోరాండమ్(యు.ఎ.ఎం)లో నమోదు చేసే వారని ఇకపై ఉద్యం రిజిస్ట్రేషన్ లోనే నమోదు చేయాలని సూచించారు. యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 5 కోట్లు వరకు ఉన్న పరిశ్రమలను సూక్ష్మ తరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 10 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 50 కోట్లు వరకు ఉన్న చిన్నతరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 50 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 250 కోట్లు వరకు ఉన్న మధ్యతరహా పరిశ్రమలుగాను కేంద్ర ప్రభుత్వం విభజించిందని వివరించారు. ఈ విభజన ప్రకారం ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు, సంబంధించిన పారిశ్రామిక వేత్తలు http://udyamregistration.gov.in లో వివరాలు నమోదు చేసుకొని ఉద్యం రిజిస్టేషన్ ను పొందవచ్చని చెప్పారు. గతంలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, పార్ట్- రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, ఉద్యోగ ఆధార్ తీసుకున్న వారు, తీసుకోనివారుతో సహా ఇంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోని పాత వారు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన వారు అందరూ కూడా తప్పనిసరిగా ఉద్యమం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన స్పష్టం చేసారు. రిజిస్ట్రేషన్ పొందని ఎం.ఎస్.ఎం.ఇలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏటువంటి సహాయం ఉండదని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.ఎం.ఇ రంగంలోని వారు వెంటనే ఉద్యం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయనసూచించారు.