రూ.100 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి..
Ens Balu
1
Collector Office
2020-11-23 20:51:15
దేశంలోనే ప్రాముఖ్యత గల విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషింగ్ హార్బర్ హైలెవెల్ మేనేజింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రహరీ నిర్మాణం అదనంగా మరో రెండు హాల్లు నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఐస్ క్రషింగ్ మిషన్, సోలార్ విద్యుత్ దీపాలు జట్టీల మరమ్మతులు మొదలైనవి చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారని తెలిపారు. వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే సభ్యులు నిపుణులు తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వవలసినదిగా కోరారు. ప్రొఫెసర్ డివి రావు డి పి ఆర్ ను గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హార్బర్ అభివృద్ధికి డి పి ఆర్ లో చేపట్టిన పనుల పట్ల సభ్యులు హర్షం వెలిబుచ్చారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సబ్ కమిటీని నియమించాలని, ఫిషింగ్ బోట్ లకు పూర్తి మరమ్మతులు సౌకర్యాన్ని హార్బర్ లోనే కల్పించాలని, కమిటీ సభ్యులు సూచించారు. మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు కె ఫణి ప్రకాష్ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కోలా గురువులు, ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సి అప్పారావు, వివిధ అసోసియేషన్ల నాయకులు జి జి తిలక్, సి. సత్యనారాయణ, బి కొండబాబు. శ్రీధర్, గంగరాజు, మత్స్య శాఖ డిడి లక్ష్మణరావు, విశాఖపట్నం పోర్టు అధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు తదితరులు పాల్గొన్నారు.