ఆన్ లైన్ లో జాతీయ స్ధాయి సెమినార్లు..బీఆర్ యు విసి
Ens Balu
4
Srikakulam
2020-07-29 14:56:44
కోవిడ్ 19 మహమ్మారితో విద్యాలయాల పరిస్ధితి, విద్యార్ధుల భవిత ప్రశ్నార్ధకం కాగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోగల డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళుతోంది. కోవిడ్ 19 మహమ్మారి ఒక వైపు నుండి ప్రజలను కదలనీయని స్ధితిలోకి నెట్టడంతో విద్యార్ధులు తరగతి గదుల్లో బోధనలు కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో విశ్వవిద్యాలయం జూన్ నెల నుండి ఆన్ లైన్ లో వివిధ సెమినార్లను నిర్వహిస్తూ విద్యార్ధులు, ఆచార్యులు తమ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఇతరులతో పంచుకోవడం జరిగింది. తాజాగా ఉన్నత పాఠశాల విద్యార్ధుల నుండి పోస్టు గ్రాడ్యుయేట్ స్ధాయి వరకు తమలో నిఘూడంగా దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి విశ్వవిద్యాలయం ఒక మంచి ప్రయత్నం ప్రారంభించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ రిసెర్చ్ డెవలప్ మెంటు కార్పొరేషన్, లారస్ లాబ్ ల సౌజన్యంతో విద్యార్ధుల సృజనాత్మక శక్తులను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగష్టు 8వ తేదీ వరకు విద్యార్ధుల నుండి వివిధ అంశాలపై మోడల్స్, పత్రాలు స్వీకరిస్తుంది. సమర్పంచిన మోడల్స్, పత్రాల్లో అత్యుత్తమ అంశాలను ఎంపిక చేసి బహుమతులను కూడా భారీగా అందజేయుటకు నిర్ణయించింది. మూడు మొదటి బహుమతులుగా లక్ష రూపాయలు చొప్పున, మూడు ద్వితీయ బహుమతులకు రూ.50 వేలు చొప్పున, మూడు తృతీయ బహుమతులుగా రూ.25 వేలు చొప్పున అందించనున్నారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పొఫెసర్ కె.రఘుబాబు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విద్యార్ధులకు తరగతులు నిర్వహించే పరిస్ధితి లేదన్నారు. ఈ తరుణంలో విద్యార్ధుల తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయుటకు సెమినార్లను ఉద్దేశించామని చెప్పారు. హైస్కూల్ నుండి పి.జి స్ధాయి విద్యార్ధులు ఇందులో పాల్గొనుటకు అవకాశం కల్పించామని, ప్రతి బృందంలో 5 గురు వరకు విద్యార్ధులు, ఒక మెంటార్ ఉండవచ్చని ఆయన చెప్పారు. ఆగష్టు 8వ తేదీ నాటికి విద్యార్ధులు తమ వ్యాస పత్రాలు, మోడల్స్ సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలు, మోడల్స్ ను ఆగష్టు 9 నుండి 14వ తేదీ మధ్య ఆన్ లైన్ లో విద్యార్ధులు ప్రదర్శించాలని చెప్పారు. వాటిలో అత్యుత్తమ మోడల్స్ ఎంపిక చేసి ఆగష్టు 15వ తేదీన తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని రఘు పేర్కొన్నారు. దేశం నలుమూలల నుండి విద్యార్ధులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర గణనీయంగా ఉందని, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి సూచనలు సలహాలు అందించాలని కోరారు. ఆన్ లైన సెమినార్లపై విద్యార్ధులకు, మెంటార్లకు అవసరమగు సమాచారం కోసం ప్రొఫెసర్ కె.రఘుబాబు, 9440114243 లేదా drraghualways@yahoo.co.in కు సంప్రదించవచ్చని చెప్పారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.brau.edu.in ను కూడా సంప్రదించవచ్చని ఆయన వివరించారు.