కరోనా 2వదశ కేసులు అధికమవుతున్నాయ్..


Ens Balu
1
Srikakulam
2020-11-24 14:44:19

శ్రీకాకుళం జిల్లాలో కరోనా 2వ దశ కరోనా తీవ్రత  అధికంగా ఉందని,  ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా వాసులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ విడుదల చేస్తూ గత ఎనిమిది నెలల కాలంలో కోవిడ్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖంలో ఉందని, తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, మరణాలు కూడా బాగా తగ్గాయని ఆయన తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి లేదని కొంత మంది భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా కనుమరుగు కాలేదని అదే సమయంలో దేశంలో రెండవ దశ వ్యాప్తి (సెకండ్ వేవ్) ప్రారంభం అయిందని గుర్తించాలని సూచించారు. మొదటి దశ కన్నా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో గత 15 రోజులుగా రోజుకు 5 నుండి 6 వేల కేసులు నమోదు అవుతున్నాయని, మరణాలు కూడా వంద వరకు ఉంటున్నాయని తెలిపారు. చలికాలం కావడంతో ప్రభావం అధికంగా ఉంటుందని, శ్రీకాకుళం జిల్లాలో శీతల వాతావరణం ఉంటుందని గమనించి కోవిడ్ ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు హర్యానా, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంటూ మాస్కు లేకుండా బయటకు వెళ్ళరాదని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.