పార్టీలకు అతీతంగా రైతులకు సేవలందిద్దాం..


Ens Balu
2
Rajahmundry
2020-11-24 17:07:32

గోదావరి డెల్టా రైతులను రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో ఉభయ గోదావరి జిల్లాల సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి కృష్ణదాస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం రైతులు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు మనకు అత్యంత ప్రాధాన్యం కాబట్టి, ఒకవైపు ప్రాజెక్టు పూర్తి కావడానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్‌ డ్యాంను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈ ఏడాది రబీ సీజన్‌ను ఖచ్చితంగా 120 రోజుల్లోనే పూర్తి చేయాలని, అందుకు రబీ సాగును కుదింపు చేయాలని నీటి పారుదల సలహ మండలి(ఐఎబి) నిర్ణయించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డెల్టా కాలువలకు విడుదల చేసే సాగునీటిని వచ్చే ఏడాది మార్చి 31న నిలుపుదల చేయాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిర్ధేశించారు. అయితే గోదావరి డెల్టాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మండలి దృష్టికి తీసుకొచ్చారు. ఆఖరికి 90 టిఎంసీల నీటితో తాగునీరు, పశువులకు సరిపడే నీటి సరఫరాతోపాటు రబీ సాగుకు ఢోకా లేకుండా రబీని పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం 2020-21 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే సంకల్పతో అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ రబీకీ 90 టిఎంసీల నుంచి 97 టిఎంసీల నీటితో ఉబయ గోదావరి జిల్లాల పరిధిలో డెల్టా కాలువలకు సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ఈ ఏడాది కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రబీ కార్యచరణను రూపొందించారు. సాగునీరు సలహా మండలి సమావేశం ప్రారంభం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో రబీ సాగుకు సంబంధించిన ఆయకట్టు వివరాలు, నీటి వసతి, తదితర అంశాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. రబీ సీజన్‌లో ఒక లక్షా 45 వేల ఎకరాల నుంచి ఒక లక్షా 50 వేల ఎకరాల వరకూ సాగు అవుతుందని వివరించారు. అయితే పోలవరం కాఫర్‌ డ్యాం వల్ల గత ఏడాది డెల్టా పరిధిలో రైతులు పలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ముఖ్యంగా అమలాపురం, టైలాండ్స్‌లో ఏప్రియల్‌లో తాగునీటికి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టైలాండ్స్‌ ప్రాంతాలకు నీరు వెళ్లాలంటే 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే సాధ్యమని తెలిపారు. ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలో డిసెంబర్‌ లోగా 85 శాతం నాట్లు పూర్తియ్యే అవకాశం ఉందని, అయితే సెంట్రల్‌ డెల్టా పరిధిలో 35 శాతం మాత్రమే నాట్లు పడే అవకాశాలు ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రబీ సాగుకు కనీసంగా 120 రోజుల నుంచి 135రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లోగా పూర్తి స్థాయిలో నాట్లు పడకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సమావేశం దృష్టికి కలెక్టర్‌ తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 5.29 లక్షల ఎకరాలు  సాగులో ఉందని, అయితే మార్చి 31నాటితో నీటి సరఫరాను నిలుపుదల చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే జరిగితే సుమారు 60 వేల ఎకరాల వరకూ ఆయకట్టులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది రబీ సీజన్లో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 120 రోజుల లోపులో పంట చేతికొచ్చేలా పంటలను వేయడం ద్వారానే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ జిల్లాలో చాగల్నాడు, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా రాజానగరం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు సాగు అవుతున్నాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయకట్టుకు సాగునీటితోపాటు, తాగునీరు, పశువులకు నీరు సక్రమంగా అందేలా చూడాలని, ఈ విషయంలో రాజీ పడవద్దని అన్నారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 31లోగా డెల్టా కాలువలను మూసివేయాల్సి ఉన్నందున రైతులు తక్కువ సమయంలో పంట చేతికి వచ్చేలా పక్కా ప్రణాళికతో పంటను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ సలహా బోర్డు సహకారంతో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 9 లక్షల 90 వేల ఎకరాలకు సాగునీరు ఎంత అవసరమో...తాగునీరు అంతే అవసరమని, ఆ దిశగా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎఈలు, డీఈలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.  గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ రంగనాథ రాజు మాట్లాడుతూ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అయినపోలవరం పనులకు ఆటంకం కల్గకుండా రైతులకు నష్టం కాకుండా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో 120 రోజుల వ్యవధిలో పంట చేతికి వచ్చేందుకు అవసరమైన ప్రణాళికను రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సాగునీటితోపాటు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. టైలాండ్‌ ప్రాంతాలకు సాగునీరు తప్పనిసరిగా అందేలా చూడాలిన ఆదేశించారు.  బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన నీటి ఎద్దడిని ఈఏడాది ఎలా అధిగమించాలో సంబంధిత శాఖల అధికారులు సమగ్ర కార్యచరణను రూపొందించాలని అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఏ పంట వేస్తే దిగుబడి త్వరగా చేతికి వస్తుందో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ విషయంలో టైలాండ్‌ రైతులను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. అలాగే కాలువల మూసివేత సమయానికి ఎక్కడ పనులు ప్రారంభం కావాలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.  రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ మార్చి 31న డెల్టా కాలువలను మూసివేస్తే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కావున అధికారుల ప్రణాళికకు వాస్తవ సంఘటనలకు 15 రోజుల వ్యవధి తేడా ఉందని, ఆ 15 రోజులపాటు నీటిని విడుదల చేయకపోతే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కావున ఆ 15 రోజులపాటు సాగునీటిని సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 31 నాటికి డెల్టా కాలువలు మూసివేయనున్నందున డిసెంబర్‌ 7 నుంచి 15 వరకూ 120 రోజుల కాలంలో పంట చేతికొచ్చే విత్తనాలను సెంట్రల్‌ డెల్టాలో వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి సూచించారు. ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో రైతులకు నష్టం లేకుండా ముందుకు సాగాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ ఇరిగేషన్‌, ఉద్యానవన, వ్యవసాయం, పట్టణ మంచినీటి సరఫరా శాఖలు సమన్వయంతో సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాని అన్నారు. గత ఏడాది ఏ ప్రాంతంలో అయితే నీటి ఎద్దడి వచ్చిందో ఆ ప్రాంతాన్ని గుర్తించడంతోపాటు, దాని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తిలంచడం జరిగిందని తెలిపారు. సీజన్‌ పూర్తియ్యే నాటికి  పంటలకు కానీ, తాగునీటికి కానీ ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సాగునీటి, తాగునీటి సమస్యలను సలహా మండలి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు, అధికారులను కోరారు. ఈ సమావేశంలో శిశు స్త్రీ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్‌ తానేటి వనిత, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్‌, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ పి.సుధాకర్‌ బాబు, గోదావరి డెల్టా సీఈ వి.శ్రీధర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు శ్రీరామ కృష్ణ, సూర్యప్రకాశరావు, జాయింట్‌ కలెక్టర్లు లక్ష్మీ శ, కే.వెంకట రమణా రెడ్డి, సబ్‌ కలెక్టర్లు అనుపమ అంజలి, హిమాన్షు కౌశిక్‌, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.