సిబ్బంది స్థానిక నివాసం ఉండాల్సిందే..
Ens Balu
2
Bhogapuram
2020-11-24 17:33:28
గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది అందరూ పని చేసే చోటనే నివాసం ఉన్ననాడే ప్రజలకు సత్వర సేవలను అందించగలరని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల అన్నారు. బయట నుండి విధులకు వస్తున్న సిబ్బంది పై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. భోగాపురం మండలం పోలిపల్లి, సవరవిల్లి గ్రామాల సచివాలయాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేసారు. సచివాలయ సిబ్బంది పంచాయతి కార్యదర్శి, వి. ఆర్. ఓ, ఎ.ఎన్.ఎం., మహిళా రక్షణ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల తో మాట్లాడి వారు చేస్తున్న పనుల పై ఆరా తీసారు. వై.ఎస్.ఆర్ జల కళ, ఈ- రిక్వెస్ట్ లు, నవశకం, , పించన్ల పంపిణీ, జగనన్న తోడు, తదితర పధకాల అమలు తీరు పై సమీక్షించారు. గడువు లోగా పరిష్కారం కాని ఈ- సర్వీసెస్ ఫై వివరణలను అడిగారు. గడువు లోగా పరిష్కరించకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సర్వీసెస్ పర్యవేక్షణ పై పంచాయతి, వార్డ్ సెక్రటరీ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని, దరఖాస్తులను గడువులోగా పరిష్కరించేలా చూడాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్ కోవిడ్ పై గ్రామం లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, మాస్క్ వాడడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు కడుక్కోవడం పై అవగాహన పెంచాలన్నారు. అదే విధంగా గర్భిణీ లకు ఎప్పటికప్పుడు హీమోగ్లోబిన్ తనిఖీ చేసి రక్త హీనత కలగకుండా పౌష్టికాహారం ఎలా తీసుకోవాలనే అంశాలను వివరించాలన్నారు. జిల్లా పరిషత్ సి.ఈ.ఓ తో టెలి ఫోన్ లో మాట్లాడుతూ పనిచేసే చోట నివాసం ఉండాలని, ఉదయం పూట ఎలాంటి సమావేశాలు ఉండకుండా సచివాలయాలకు హాజరయ్యేలా ఒక సర్కులర్ ఇవ్వాలని, ఉదయం సచివాలయ సిబ్బంది కేవలం ప్రజలకు అందుబాటు లో ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతేనే సచివాలయం విడిచి బయటకు అనుమతి తో వెళ్ళాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పధకాల పై అవగాహన కల్పిస్తూ వాటి ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేయ్యలన్నారు.