సుందరంగా జ్యోతీరావుపూలే కూడలి..
Ens Balu
1
Vizianagaram
2020-11-24 19:18:56
విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం వున్న ప్రాంతాన్ని అత్యంత సుందరమైన కూడలిగా రూపొందించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. జ్యోతిరావుపూలే విగ్రహం ఉన్న ప్రదేశాన్ని మునిసిపల్ ఇంజనీర్ కె.దిలీప్, బి.సి.కార్పొరేషన్ ఇ.డి. నాగరాణితో కలసి మంగళవారం సందర్శించారు. జ్యోతిరావుపూలే విగ్రహం పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా త్వరగా ఏర్పాటు చేయాలని బి.సి.కార్పొరేషన్ ఇ.డి. నాగరాణిని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఒక వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా రూపొందించాలని మునిసిపల్ ఇంజనీర్ దిలీప్‌కు సూచించారు. దండుమారమ్మ ఆలయానికి ఇదే దారిగా ఉన్నందున ఆలయానికి వెళ్లే దారిని సూచిస్తూ ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలన్నారు. జ్యోతిరావుపూలే విగ్రహం స్పష్టంగా కనిపించేలా పైన వున్న చెట్ల కొమ్మలు తొలగించాలని చెప్పారు. ఏ.సి.బి. కార్యాలయానికి వెళ్లే ప్రాంతంలోనూ ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు.ఈనెల 28న జ్యోతిరావుపూలే వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను కూడా తెలుసుకున్నారు.