మరింత పటిష్టంగా నీతిఆయోగ్ కార్యక్రమం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-24 19:23:22
విభిన్న ప్రతిభావంతులకోసం కేంద్ర ప్రభుత్వ నీతిఆయోగ్ పర్యవేక్షణలో అమలు జరుగుతున్న సురక్షిత్ దాదా దీదీ, నానా నానీ అభియాన్‌ను మరింత ప్రయోజనకరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్వచ్ఛందసంస్థలకు సూచించారు. వారి వ్యక్తిగత సమస్యలను సైతం పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ప్రతిఒక్కరి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములుగా వున్న జిల్లాలోని ఐదు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న వికలాంగుల పునర్నిర్మిత కేంద్రం ప్రాజెక్టు అధికారి వి.విజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్‌తో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతిఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యకలాపాలపై నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఐదు స్వచ్ఛందసంస్థలు ఏయే అంశాల్లో పనిచేస్తున్నదీ కలెక్టర్ తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన వరల్డ్ విజన్, నీడ్, స్వార్డ్, నేచర్, లెప్రసీ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తమ సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా వారు వి.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి జల అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్‌ను సత్కరించారు.