జర్నలిస్టు ప్రసాద్ మృతికి డిప్యూటీ సీఎం సంతాపం..
Ens Balu
4
Srikakulam
2020-11-24 19:59:13
'విశాలాంధ్ర' సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ ముత్యాల ప్రసాద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, నమ్మిన సిద్ధాంతం కోసం, పాత్రికేయుల సంక్షేమానికి అహర్నిశలు పనిచేసేవారని అన్నారు. పూర్తి నిబద్దతతో తన వృత్తిలో రాణించారని, సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా, భావి తరాలకు మార్గదర్శంగా నిలిచారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముత్యాల ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. ఇటీవలే విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించానని, విజయవాడ జీజీహెచ్లో ఆయన చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం అందుతోందని సమితి సభ్యులు చెప్పిన విషయం ఇప్పటికీ తన కళ్ళముందు కనబడుతోందని, ఇంతలోనే ఇలాంటి బాధాకరమైన వార్త వినడం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. తెలుగు నేలపై తొలి దినపత్రికగా తన ప్రస్థానం ప్రారంభించి ప్రజా పత్రికగా అందరి మనసులో స్థానం సంపాదించుకున్న 'విశాలాంధ్ర' ఇటీవలే మాజీ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారిని, ఇప్పుడు ముత్యాల ప్రసాద్ ని కోల్పోవడం తీరనిలోటని కృష్ణదాస్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.