అక్షర సేద్యంలో అలుపెరగని కృషీవలుడు..
Ens Balu
1
Visakhapatnam
2020-11-25 16:15:40
అక్షర సేద్యంలో అలుపెరగని కృషీవలుడు విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ అని పలువురు వక్తలు కొనియాడారు. విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ సంతాప సభ బుధవారం స్థానిక పౌర గ్రంధాలయంలో దినపత్రిక బ్యూరో చీఫ్ డా.ఎమ్.ఆర్.ఎన్.వర్మ అధ్యక్షతన జరిగింది. సెంచురియన్ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య జి ఎస్ ఎన్ రాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, జాతీయ సర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు చంద్రమోహన్, యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రాము,ఉపాధ్యక్షులు సత్యనారాయణ,స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ ,విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజు, రచయిత మేడా మస్తాన్ తదితరులు పాల్గోని ప్రసంగించారు. ముత్యాల ప్రసాద్ విశాలాంధ్ర సంపాదకులుగా మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల పక్షాన నేటి యువతరం లో ఉండవలసిన నైతిక విలువలు సమాజంలో వస్తున్న కొత్త అవకాశాలు అవసరాలకు తగినట్లు సమకాలీన వ్యాసాలను అందించడంలో ఎంతో కృషి చేశారని వక్తలు ఉద్ఘాటించారు. అందులో కమ్యూనిస్టుల పత్రికలో సంపాదకులు గా మరియు రచయితగా మంచి సాహితీవేత్తగా జర్నలిస్టుల నేతగా పాత్రికేయుల ఆశాదీపంగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ముత్యాల ప్రసాద్ అన్నారు. ఆయన నేడు మనమధ్య లేకపోయినా అతను రాసిన పుస్తకాలు, వ్యాసాలు నేటి తరానికి రాబోయే తరానికి ఆదర్శనీయమన్నారు.ఎంతోమందిని విలువలతో కూడిన జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత ముత్యాల ప్రసాద్ కు దక్కుతుందని, ఆయన మరణం పాత్రికేయ రంగానికే కాకుండా సాహితీ లోకానికి తీరని లోటని వక్తలు అభిప్రాయపడ్డారు. లక్ష్యం పట్ల లక్ష్య శుద్ధి కలిగిన వ్యక్తి లక్ష్యం సిద్ధించేందుకు చేసిన అవిశ్రాంత కృషి వృధా పోదని నమ్మిన క్రియాశీలుడు ముత్యాల ప్రసాద్ అన్నారు.జర్నలిజాన్ని సంపాదకీయాన్ని సమాజహితం గా ముందుకు నడపడంలో చోదకశక్తిగా ముత్యాల ప్రసాద్ విశాలాంధ్రలో చేసిన అక్షర సేద్యం నిరంతరం వెలుగును ప్రసవిస్తునే ఉంటాయన్నారు. విలువలు పడిపోతున్న నేటి తరంలో దశ దిశ పట్ల ప్రజాతంత్ర వామపక్ష పదజాలంతో ఆయన అందించిన వ్యాసాలు అందరి మదిలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాలాంధ్ర సబ్ ఎడిటర్ ఆర్ రమేష్ వందన సమర్పణతో సభ ముగించారు.