వి ఎస్ ఎస్ భూములకు అటవీ హక్కుపత్రాలు..రంజిత్ భాషా


Ens Balu
2
Paderu
2020-07-29 18:48:15

 గిరిజన రైతులు వనసంరక్షణ సమితీల్లో సాగుచేస్తున్న అటవీ భూములకు అటవీ హక్కుపత్రాలు అందిస్తామని గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా పేర్కొన్నారు. బుధవారం పాడేరు మండలం గుర్రగరువు,మోదాపల్లి గ్రామాల పరిధిలోని వన సంరక్షణ సమితీల్లో సాగుచేసిన కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీతోటల్లో గిరిజన రైతులతో ముచ్చటించారు. ఎన్ని ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు ? గత ఏడాది కాఫీ పంట,మిరియాలు పంటలపై వచ్చిన ఆదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోదాపల్లి గ్రామంలో కాఫీ రైతులతో సమావేశ మయ్యారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతీ గిరిజన రైతులకు వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున అటవీ హక్కుపత్రాలు మంజూరు చేస్తామన్నారు. అటవీ హక్కుపత్రాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అన్నారు. బ్యాంకుల రుణాలు పొంద వచ్చని చెప్పారు. అటవీ హక్కులు పొందిన గిరిజన రైతులకు 150 రోజులు ఉపాధి పని కల్పిస్తామని, ఉపాధిహామీలో ఆయా భూములను అభివృధ్ది చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు కాఫీ కల్లాలు, తార్పాలిన్లు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి పధకాలను మంజూరు చేయాలన్నారు. మోదాపల్లిలో 49 క్లైములు, గుర్రగరువులో 22 క్లైములు వచ్చాయని రెవెన్యూ అధికారులు వివరించారు. అనంతరం సంగోడి ఎపి ఎఫ్ డిసి కాఫీ తోటలు పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో అటవీశాఖ,రెవెన్యూ అధికారులతో సమావేశమై అటవీ హక్కుపత్రాలు జారీ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల,డి ఎఫ్ ఓ వినోద్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. చినబాబు , కాఫీ ఎడి రాధాకృష్ణ, తాహశీల్దార్ ప్రకాశరావు, సబ్ అసిస్టెంట్ అప్పలనాయుడు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.
సిఫార్సు