మార్చినాటికి రూ.400 కోట్లు పనులు పూర్తికావాలి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-25 18:22:14
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చే మార్చి నెలాఖరుకు రూ.400 కోట్ల విలువైన కన్వర్జెన్సీ పనులను పూర్తి చేసేవిధంగా ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. ఉపాధిహామీ పనులపై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి పెద్దిరామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజా శంకర్ బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉపాధి కన్వర్జెన్సీ పనులను వేగవంతం చేయాలని, మార్చి నెలాఖరుకి రాష్ట్రంలో సుమారు రూ.4వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని, దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి నాటికి రూ.400 కోట్ల విలువైన కన్వర్జెన్సీ పనులను నిర్వహించేందుకు తగిన ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి వేతనదారులకు పనికల్పనలో ఎప్పటిలాగే జిల్లాలో లక్ష్యాన్ని శతశాతం కంటే ఎక్కువగా సాధించామన్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ఇప్పటికే ఆయా శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. సిమ్మెంటు కొరత, బిల్లుల మంజూరులో జాప్యం, కాంట్రాక్టర్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా కన్వర్జెన్సీ పనులు కొంత నెమ్మదిగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, పిఆర్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, ఇఇ కె.వి.శివానందకుమార్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.