విజయనగరంలో జగనన్నతోడు..రూ.30.4కోట్లు..
Ens Balu
3
Vizianagaram
2020-11-25 18:28:34
బ్యాంకుల నుంచి రుణ సహాయం పొందడంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, హస్తకళాకారులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని ఆర్ధికాభ్యున్నతి చెందేందుకు జగనన్న తోడు పథకం గొప్ప వరమని విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చిరు వ్యాపారులకు సున్నవడ్డీ రుణాలు బ్యాంకుల ద్వారా అందించే జగనన్నతోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి నివాసం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న అనంతరం ఎం.పి. బెల్లాన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఈ పథకం అమలులో మొదటి మూడు స్థానాల్లో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోంచి బయటపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంటూ, చిరు వ్యాపారులకు సున్నవడ్డీ రుణాలు అందించే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డికి చిరు వ్యాపారస్థుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలుస్తుండటం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ జిల్లాను మొదటిస్థానంలో నిలుపుతున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్‌లాల్‌ను అభినందించారు.
జిల్లాలో 36,191 మంది చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు రూ.35.51 కోట్ల సున్నవడ్డీ రుణాలను జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల నుండి అందించామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ఈ పథకం చిరు వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారుల కుటుంబాల ఆర్ధిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారస్తుల కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయి వున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి సున్నవడ్డీ రుణాలు అందించడం వారికి ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమం అమలులో సహకరించిన జిల్లాలోని బ్యాంకర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిరు వ్యాపారులను గుర్తించి వారికి రుణాలు అందజేయడంలో సెర్ప్, మెప్మా సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు మంచి కృషి చేశారని పేర్కొంటూ వారందరినీ అభినందించారు. పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానవత్వంతో కూడిన పరిపాలన అందిస్తున్నారని, అందువల్లే ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో మానవతా దృష్టి కనిపిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ సుఖంగా జీవించే పరిస్థితి వుండాలని, ప్రతిఒక్కరి జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానమే రాష్ట్రానికి అభివృద్ధి విధానమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు చిరు వ్యాపారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తిగత రుణ మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాలోని చిరు వ్యాపారులకు రూ.35.51 కోట్ల సున్నవడ్డీ రుణానికి సంబంధించిన చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రుణాలు అందజేయడంలో సహకరించిన ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, ఎస్.బి.ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ.పి.గ్రామీణ వికాస్ బ్యాంకు ప్రతినిధులను జిల్లా కలెక్టర్, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు తదితరులు సత్కరించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లను లబ్దిదారులు సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ కె.సుగుణాకర్ రావు, డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు రామచంద్రరావు, రాజ్‌కుమార్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డి.పి.ఎం. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.