ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టాలి..
Ens Balu
1
Srikakulam
2020-11-25 18:43:36
శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలోని ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టాలని రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో సంబంధిత అధికారులు అలక్ష్యం వహిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లను హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వి.ఆర్.ఓలు, పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లతో ఆర్.డి.ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కాబట్టి అధికారులు ధాన్యం సేకరణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో పి.పి.సి ఇన్ ఛార్జ్ లు , టెక్నికల్ అసిస్టెంట్లు రైతు కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. రైతుల నుండి ధాన్యం సేకరించే సమయంలో వారితో మర్యాదగా నడుచుకోవాలని, రైతుకు గిట్టుబాటు ధరను అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంకు అవసరమైన సామాగ్రిలను ఇప్పటికే అందజేయడం జరిగిందని, ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తిచేసి రైతు ఖాతాలో నగదు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు నుండి ధాన్యం సేకరించే సమయంలో తేమ శాతం పరిశీలించే సామాగ్రి సక్రమంగా పనిచేస్తున్నది, లేనిదీ ముందుగానే పరిశీలించుకోవాలని, తేమ శాతాన్ని పరిశీలించకుండా ధరను అంచనా వేయరాదని అన్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న సంగతిని గుర్తుచేసిన ఆయన ఆర్.బి.కెలో రిజిష్టర్ అయిన పిదప రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే తేదీలను, సమయాన్ని కేటాయించడం జరుగుతుందని, షెడ్యూలు ప్రకారం ధాన్యాన్ని రైతుల నుండి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, ఇందుకు పి.పి.సిలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతీ రోజూ ధాన్యం కొనుగోళ్లు చేసిన వివరాలను సంబంధిత రిజిష్టరు నందు నమోదుచేయాలని, అలాగే మిగిలిన రైతుల వివరాలు తెలుసుకొని వారికి ధాన్యం కొనుగోలుపై తెలియజేయాలని సూచించారు. ప్రతీ పి.పి.సి సెలవు దినముతో సంబంధం లేకుండా రైతుల సేవకే అంకితం కావాలని, సరియైన పనివేళలను పాటించాలని పేర్కొన్నారు. రైతుల ధాన్యం తడిచే పరిస్థితి లేకుండా చూసుకోవాలని, తేమ విషయంలో గాని, తూకం విషయంలో గాని రైతులు మోసపోకుండా చూడాలని వివరించారు. రెవిన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాలు, డి.ఆర్.డి.ఎ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో , సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రేడే ఎ రకానికి రూ.1880/-లు, కామన్ రకానికి రూ.1868/-లు చెల్లించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని పి.పి.సిల నుండి మాత్రమే మిల్లులకు చేరాలని, అంతేగాని కల్లం నుండి నేరుగా మిల్లుకు పంపరాదని తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం మన మిల్లులకు రాకుండా చూడాలని, అటువంటి ధాన్యం లారీలు వస్తే వాటిని సీజ్ చేసి సెక్షన్ 6ఎ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి ఎ.ఉదయ భాస్కర్, సి.ఎస్.డి.టిలు పైడిరాజు, శ్రీనివాసరావు, మధు, కవిత, పౌర సరఫరాల సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ విశాలాక్షి, సి.ఎస్.డి.టిలు, వి.ఆర్.ఓలు, పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.