నిర్మాణపనుల సిమ్మెంటుకి రూ.15 పెంచండి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-25 18:48:35
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడ నుండి ఈ విషయమై రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. హామీ నిధులను వేగంగా ఖర్చు చేసినట్లయితే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడి సెంటర్ల భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, రోడ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉపాధి హామీ పథకం భవన నిర్మాణాల ప్రగతిని జిల్లాల వారీగా తెలియజేశారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణ పనులకు సరఫరా చేస్తున్న సిమెంట్ బస్తా పై అదనంగా రూ.15 లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ. 10లతో కలిపి మొత్తం రూ.25 లు అవుతుందని తెలిపారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సిమెంటు సరఫరా ఆలస్యం అవుతుందని, నిర్మాణాలను వేగవంతం చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన సిమెంటును సకాలంలో సరఫరా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. నర్సీపట్నం పాయకరావుపేట నియోజకవర్గాలలో ఇసుక కొరత ఉన్నందున తూర్పుగోదావరి నుండి ఇసుక సరఫరా చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రోడ్లు నిర్మించేందుకు 100 శాతం ఉపాధి హామీ పనులను మంజూరు చేయవలసిందిగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామచంద్ర రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి తగిన ఆదేశాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.