అనంతలో భారత దేశ ప్రజలమైన మేము..


Ens Balu
3
Anantapur
2020-11-25 19:57:00

అనంతపురంజిల్లాలో ఈ నెల 26వ తేదీనుండి వచ్చే ఏడాది జనవరి 26 వరకు  "భారత దేశ ప్రజలమైన మేము" పేరుతో  జిల్లా వ్యాప్తంగా  రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  బుధవారం సాయంత్రం రాజ్యాంగ దినోత్సవ వేడుకల  నిర్వహణ పై జిల్లా అధికారులు, ఆర్డీవోలు తదితరులతో  జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన  "భారత దేశ ప్రజలమైన మేము" పేరుతో   నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తూ,  జిల్లాలోని గ్రామ, వార్డు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో  ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను చదివి  వినిపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ప్రతి కార్యాలయంలో రాజ్యాంగ పీఠిక ఉంచాలన్నారు. గౌరవ సూచకంగా రాజ్యాంగ పీఠిక తో  సెల్ఫీ తీసుకుని  అందరికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్స్ లో పోస్ట్ చేయాలన్నారు. జిల్లా అధికారులు తమ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగేలా చూడటం తో పాటు ఏదో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులు చేయాలన్నారు. అలాగే ప్రతి పాఠశాలలోనూ 27 వ తేదీ నుంచి  ప్రార్థన సమయంలో విద్యార్థులచే హెడ్మాస్టర్లు ప్రతిరోజు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాలని  జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 35 వేల మంది పదవ తరగతి విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రతులు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇవి సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు.  విరాళాలు ప్రోగు చేసి ఇంకా ఎక్కువ కాపీలు పంపిణీ చేసేలా కూడా చర్యలు తీసుకోవచ్చని అధికారులకు కలెక్టర్ సూచించారు. జనవరి 26 వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశంపై రాజ్యాంగం గురించి తెలుసుకోండి, సమానత్వం, సౌభ్రాతృత్వం,ఆర్థిక న్యాయం తదితర అంశాలపై నిర్దేశించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని  కలెక్టర్ ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులు,గ్రామ స్థాయిలో హెడ్మాస్టర్లు వారి పరిధిలో ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.  ఇందులో భాగంగా ఆలయ ప్రవేశం, కులాంతర వివాహాలు చేసుకున్నవారికి సన్మాన కార్యక్రమాలు, జోగినీ వ్యవస్థ నిర్మూలన తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. భారత  దేశ ప్రజలమైన మేము కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం నాడు శారదా మునిసిపల్ హైస్కూల్ లో రాజ్యాంగ పీఠిక ను చదవనున్నారు..