27లోగా సచివాలయ ఉద్యోగాలు భర్తీపూర్తి..
Ens Balu
3
విజయనగరం
2020-11-26 12:05:15
విజయనగరం జిల్లాలో చేపట్టిన సచివాలయ ఉద్యోగ ఖాలీల భర్తీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ సచివాలయాల్లో వివిధ ఖాలీల భర్తీకి రెండో దశలో 1134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కూడా, అక్టోబరు 31 లోపు మరో 339 పోస్టులు ఖాలీ అవ్వడంతో, మొత్తం 1473 పోస్టులకు భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీలోగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ శాఖల్లో ఇప్పటివరకు సుమారు 740 పోస్టులను భర్తీచేయడం జరిగిందన్నారు. వీరికి నియామక పత్రాలను కూడా అందజేశామని చెప్పారు. ఈ సారి కూడా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఖాలీలు మిగిలిపోయే అవకాశం ఉందన్నారు. అలాగే సాంకేతికపరమైన కొన్ని విభాగాల్లోని ఉద్యోగాలకు తగినంతమంది అర్హులు లేకపోవడంతో, వాటిలో కొన్ని పోస్టులు మిగిలిపోతాయన్నారు. స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీసుమెన్ తదితర కొన్ని విభాగాల్లో అర్హులైనవారు లేనిపక్షంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని ఇతర కేటగిరీలతో నింపాలని, సర్టిఫికేట్లు సమర్పించని వారికి బదులు, వారి తరువాతవారికి అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, జెడ్పీ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.