పాడిపెంపకంతో రైతులకు ఆర్ధిక బరోసా..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-26 18:00:31

పాడి ప‌శువులు, గొర్రెలు, మేక‌లు పంపిణీ ద్వారా పేద‌ల‌కు ఆర్థికంగా భ‌రోసా క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు అన్నారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్ చేయూత‌, ఆస‌రా ప‌థ‌కం ల‌బ్దిదారులు 70,960 మందిని జిల్లాలో ఈ ప‌థ‌కానికి ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. స్థానిక డిఆర్‌డిఏ స‌మావేశ మందిరంలో ఈ ప‌థ‌కంపై సంబంధిత అధికారులు, బ్యాంక‌ర్ల‌తో గురువారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  వైఎస్ఆర్ ఆస‌రా, చేయూత ప‌థ‌కం క్రింద జిల్లాలో ఇప్ప‌టికే సుమారు లక్షా,53వేల మందికి కిరాణా, ఇత‌ర చిన్న‌చిన్న‌ వ్యాపారాల ద్వారా ఉపాధి క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. రెండో ద‌శ‌లో ఈ ప‌థ‌కం క్రింద‌ 41,339 మంది మ‌హిళ‌ల‌కు ఆవుల‌ను, 9,567 మంది మ‌హిళ‌ల‌కు గేదెల‌ను, 8,412 మంది మ‌హిళ‌ల‌కు గొర్రెల‌ను, 11,582 మంది మ‌హిళ‌ల‌కు మేక‌ల‌కు పంపిణీ చేసేందుకు ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు తెలిపారు. ఒక్కో యూనిట్ ఖ‌రీదు రూ.75వేలు కాగా, దీనిలో రూ.56,500 ను బ్యాంకు రుణంగా ఇస్తుంద‌ని, రూ.18,500ను ల‌బ్దిదారులు భ‌రించాల్సి ఉంద‌ని చెప్పారు.            ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు మాట్లాడుతూ,  ల‌బ్దిదారులు త‌మ‌కు కావాల్సిన ప‌శువుల‌కు సంబంధించి త‌ప్ప‌నిస‌రిగా అంగీకార ప‌త్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పారు. వివిధ శాఖ‌ల అధికారుల స‌మ‌క్షంలో, రైతు భ‌రోసా కేంద్రం వ‌ద్దే ప‌శువుల కొనుగోలు, అమ్మ‌కాల‌కు ఒప్పందం చేయాల్సి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇత‌ర మండ‌లాల‌ తోపాటు, ఇత‌ర జిల్లాలనుంచి కూడా ప‌శువుల‌ను కొనుగోలు చేసుకొనేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని తెలిపారు. ప‌శువుల‌కు త‌మ వైద్యుల‌చేత‌ పూర్తిగా వివిధ‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన త‌రువాతే కొనుగోలుకు అనుతించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు మాట్లాడుతూ పేద‌ల జీవితాలకు ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ద్వారా, వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. అర్హులైన వారంద‌రికీ, మంచి మేలు జాతి పాడి ప‌శువులు, మేక‌లు, గొర్రెల‌ను కొనుగోలు చేసేలా అధికారులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. వీలైనంత త్వ‌ర‌గా ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని, దీనిలో భాగంగా శుక్ర‌వారం నుంచే క్షేత్ర‌స్థాయిలో ల‌బ్దిదారుల‌కు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన వివ‌రాల‌ను అక్క‌డి ఎంఎల్ఏల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యించుకొని, ప్ర‌ణాళికాబ‌ద్దంగా డిసెంబ‌రు 5లోగా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని చెప్పారు. ప‌శువుల కొనుగోలులో ఏమైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినా, నిబంధ‌న‌లు అతిక్ర‌మించినా సంబంధిత సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జెసి హెచ్చ‌రించారు.