వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను పునరుద్దరించాలి..
Ens Balu
4
విశాఖ కలెక్టరేట్
2020-11-26 19:07:02
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ గురువారం దేశవ్యాప్తంగా పలు కార్మిక వర్గాలు సమ్మె బాట పట్టాయి. అత్యంత కీలకమైన రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను కూడా వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య, ఏపీ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా కలెక్టరు కార్యాలయం ఎదుటశాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తక్షణమే కేంద్రం వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1955- 1958 లు 2చట్టాలు కూడా జర్నలిస్ట్ లకు అత్యంత కీలకమన్నారు. జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగానే కొనసాగించాలని, శ్రీనుబాబు కోరారు. అంతేకాకుండా 1958 చట్టం ప్రకారం వేతనాలు నిర్ధారణ కమిటీ కి సంబంధించి కూడా కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ రెండు చట్టాలు రద్దు చేసిన నేపథ్యంలో జర్నలిస్టులకు అత్యంత నష్టం వాటిల్లుతుందని శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం రద్దు చేసిన 44 కార్మిక చట్టాల్లో ఉన్న రెండు చట్టాలు జర్నలిస్టుల కోసం త్వరగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా జర్నలిస్ట్ ల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘాలు పని చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు నష్టం చేసే రెండు చట్టాలను తక్షణమే కేంద్రం పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం డిఅర్వో ఎ ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో ఫెడరేషన్ ఉపాద్యక్షులు బందరు శివ ప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు బండి శివరాం, పి.నగేష్ బాబు, కడలి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.