రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలి..


Ens Balu
2
Anantapur
2020-11-26 19:38:29

రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య విద్యార్థినులకు  పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఒకటవ రోడ్డు లోని శారదా మున్సిపల్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా "భారత దేశ ప్రజల మైన మేము" పేరుతో  జిల్లాలో  రెండు నెలల పాటు వినూత్నంగా  నిర్వహించనున్న  రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని తొలుత జ్యోతి ప్రజ్వలనతో ఎంపీ,  కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) ఏ.సిరి ఇతర అధికారులు ప్రారంభించారు.  అనంతరం భారత రత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలి.సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందిద్దామని పాఠశాల  విద్యార్థినులతో కలిసి  రాజ్యాంగ పీఠిక ను  ఎంపీ, కలెక్టర్,జేసీ,అధికారులతో కలిసి చదివారు.  ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాటిని అమలు చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక అంశాలను చదవడంతో పాటు అర్థం చేసుకోవడం అతి ముఖ్యమన్నారు.సమాజంలోని తోటి పౌరులను ఎలా గౌరవించాలి .సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను ఎలా పారదోలాలి, పర్యావరణాన్ని ఏవిధంగా పరిరక్షించాలి అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం తోపాటు నిత్యజీవితంలో ఆచరించాలని ఆయన సూచించారు.తద్వారా రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలని ఆయన పేర్కొన్నారు .రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా సజీవ సాక్ష్యాలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నారు. అందుకు సంబంధించి  పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గురించి ,అలాగే  చాయ్వాలా నుండి ప్రధాన మంత్రి గా ఎదిగిన నరేంద్ర మోది ల గురించి ఉదాహరించారు .అలాగే తాను, కలెక్టర్ కూడా క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరామని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను  క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విస్తృతంగా చర్చలు జరిపిన మీదట భారత రాజ్యాంగాన్ని ఖరారు చేశారన్నారు. రాజ్యాంగ రచనా సంఘం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141సార్లు సమావేశాలు జరిపి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారత రాజ్యాంగ లక్ష్యం ప్రజలకు సామాజిక ,రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందించడమే అన్నారు. నేడు మన రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులకు భరోసా ఇస్తోందన్నారు సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడి నుంచి రక్షణ పొందే హక్కు ,మతస్వేచ్ఛ హక్కు ,విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిష్కారాలు కోరే హక్కులన్నారు. ఈ హక్కుల రక్షణ మన రాజ్యాంగానికి ప్రధాన స్ఫూర్తి గా నిలుస్తోందన్నారు. రాజ్యాంగం గురించి పూర్తిగా విద్యార్థినీ,విద్యార్థులు తెలుసుకోవాలని ,దీని గురించి తెలుసుకోవడమే కాకుండా నలుగురికి తెలియజెప్పాలన్నారు. జిల్లాలో నేటి నుంచి 26 జనవరి 2021 వరకు ఎనిమిది వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఏ రోజు ఏ అంశంపై చర్చించారో, ఆ చర్చలు జరిగిన రోజులను తేదీల వారీగా సూచిస్తూ రాజ్యాంగ క్యాలెండర్ ని బొమ్మలతో సహా రూపొందించాలన్నారు.అలా రూపొందించిన వారిలో ముగ్గురికి  జనవరి 26 వ తేదీన జిల్లా స్థాయిలో మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అలాగే ఏ పాఠశాలల్లోని విద్యార్థినీ,విద్యార్థులు, అధ్యాపకులు కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఎక్కువమందిని గుర్తించి సన్మానిస్తారో అలాంటి వారిని కూడా ఎంపిక చేసి జనవరి 26 వ తేదీన సత్కరించడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా అభివర్ణించారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా పేర్కొన్నారని దీనివలన మనమంతా స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు .హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. అందరూ కలిసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .భవిష్యత్తులో రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డి ఓ శామ్యూల్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు నెలలపాటు రాజ్యాంగ ఉత్సవాలను నిర్వహించబోతున్నామన్నారు.ప్రతి విద్యార్థి రాజ్యాంగం లో నిష్ణాతులు కావాలన్నారు. డిగ్రీ ఆపై చదువు లో నేర్చుకునే ఈ అంశాన్ని తొమ్మిది, పది తరగతుల విద్యార్థిని, విద్యార్థులు చదివే అవకాశం లభించిందన్నారు. జిల్లాలోని 34 వేల మంది విద్యార్థిని ,విద్యార్థులకు రాజ్యాంగ ప్రతులను అందిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ భారత రాజ్యాంగ పీఠిక యొక్క ప్రాముఖ్యత ,ప్రాథమిక హక్కులు మరియు బాధ్యతలు వివరించాలని ఆయన తెలిపారు .విద్యార్థులను బాధ్యతాయుతమైన మరియు ఉత్పాదక మైన పౌరునిగా  తయారుచేయాలని హెడ్ మాస్టర్లకు, టీచర్లకు ఆయన సూచించారు. అనంతరం రాజ్యాంగ పుస్తకాల ప్రతులను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ,ఎం పీ,అధికారులు అందించారు .చదవటం మాకు ఇష్టం అనే లోగోను  ముఖ్య అతిధులు ఆవిష్కరించారు .ఇందులో భాగంగా గ్రంధాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి  ,సర్వ శిక్ష ఏపిడి తిలక్ విద్యాసాగర్, మున్సిపల్ ఆర్ డి నాగరాజు, హెడ్మాస్టర్ రమాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.