కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కు అభినందనల వెల్లువ..
Ens Balu
3
Vizianagaram
2020-11-27 17:59:18
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌కు మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఢిల్లీకి చెందిన ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో వివిధ రంగాల్లో సుదీర్ఘకాలంపాటు ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి, ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ గత 20 ఏళ్లుగా ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఇప్పటికే జిల్లాకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిపెట్టిన కలెక్టర్ హరి జవహర్ లాల్, మరో ప్రముఖ పురస్కారానికి ఎంపిక కావడంతో, ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ జిల్లా కలెక్టర్‌గా రావడం జిల్లాకు వరం అని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ కొనియాడారు. మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పురస్కారానికి ఎంపికైన కలెక్టర్‌ను పలువురు ఉన్నతాధికారులు, పాత్రికేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది శుక్రవారం శాలువలతో సత్కరించి, పూలగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ, మన కలెక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లాను అన్నివిధాలా అభివృద్దివైపు నడిపిస్తూ, ఇప్పటికే పలు అవార్డులను సాధించిపెట్టారని అన్నారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ జిల్లాను ఇతర జిల్లాలకంటే ముందు ఉంచాలన్న తపన కలెక్టర్‌లో చూసానని అన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. కారుణ్య నియామకాల్లో గానీ, సచివాలయ ఉద్యోగాల భర్తీలో గానీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీలో గానీ కలెక్టర్ చూపించిన చొరవ ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి డి.రమేష్ మాట్లాడుతూ తన అపార అనుభవంతో జిల్లాను కలెక్టర్ అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రణాళికా బద్దమైన కృషి, సానుకూల దృక్పథం, అందరినీ కలుపుకొని జిల్లాను కలెక్టర్ ముందుకు నడుస్తుండటం వల్ల ఎన్నో పురస్కారాలు లభిస్తున్నాయని చెప్పారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ విలువలకు నిలువటద్దమని కెఆర్ఆర్‌సి ఉప కలెక్టర్ కెబిటి సుందరి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయాలకు ప్రతిరూపంగా మారారని, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి కొనియాడారు. జిల్లాకు కలెక్టర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన పాలనాదక్షత కారణంగానే అవార్డులు వరిస్తున్నాయని సిపిఓ జె.విజయలక్ష్మి ప్రశంసించారు.