ఆర్బీకేలలో రైతుల వివరాలు నమోదు చేయాలి..


Ens Balu
3
Srikakulam
2020-11-27 20:12:52

శ్రీకాకుళం జిల్లాలోని  రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశ ముందని, దీనిలో  8 లక్షల టన్నులను జిల్లాలోని 246 పి.పి.సిల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 811 రైతు భరోసా కేంద్రాలను  246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు మద్దతు ధరగా సాదారణ రకానికి 100 కేజీలకు రూ.1868/-సు, 80 కేజీలకు రూ.1494.40పై, గ్రేడ్ ఎ-రకానికి 100 కేజీలకు రూ.1888/-లు, 80 కేజీలకు రూ.1510.40 పై నిర్ణయించినట్లు చెప్పారు. పౌర సరఫరాల సంస్థ వెలుగు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా  కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్, కన్స్యూమర్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్, గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్  కో-ఆపరేటివ్  సొసైటీస్, మొలక రైతు సంఘాలు, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీస్ మరియు రైతు ప్రోడ్యుసింగ్ ఆర్గనైజేషన్  ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.  ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే కొనుగోలు సిబ్బంది, కేంద్రానికి అవసరమగు తేమ కనుగొను పరికరము, ట్యాబ్, కంప్యూటర్, ప్రింటర్, ఎనాలిసిస్ కిట్, ఫోకర్, పొట్టు తీసే పరికరాలను  ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి ప్రభుత్వం క్రొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని, దాని ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే తమకు అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వివరాలు నమోదు చేసుకోవలసి ఉందని చెప్పారు. రైతుల వివరాలు ఆర్.బి.కెల్లో  నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్(జాతీయ బ్యాంకు ఖాతా),పట్టాదారు పాస్ బుక్ (స్వంతభూమి)లేదా సి.సి.ఆర్.సి మరియు ఎల్.ఇ.సి కార్డు, లీజు భూమి పత్రాలతో పాటు మొబైల్ ఫోన్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని వివరించారు. జిల్లాలోని రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకుని, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.