ఫూలే ఆశయాలు సాధించాలి..
Ens Balu
4
Vizianagaram
2020-11-28 12:17:35
మహాత్మా జ్యోతిభా ఫూలే ఆశయాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. శనివారం ఫూలే వర్థంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద నున్నవిగ్రహానికి, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, బిసి సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు జ్యోతిభా పూలే అని కొనియాడారు. ఆయన స్మారకార్థం విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఫూలే సర్కిల్ గా నామకరణం చేసి, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించారు. పూలే విగ్రహం ప్రక్కనే సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బిసి సంఘాలు ముందుకు వచ్చాయని, దీనికి స్థానిక ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి కూడా సహకారం అందించనున్నారని చెప్పారు. వీలైనంత త్వరలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సర్కిల్ అభివృద్ది పనులను కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రంగుముద్ర రమాదేవి మాట్లాడుతూ జ్యోతిభా పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, సామాజిక వెనుకబాటుకు గురైన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చేసిన ఆదర్శవంతమైన సేవలను జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఫూలే ఆశయాల సాధనలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, బిసి కులాల కోసం 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, జిల్లా బిసి సంక్షేమాధికారి ఆర్‌వి నాగరాణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, డిపిఓ కె.సునీల్‌రాజ్‌కుమార్, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలాకుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, డిపిఆర్ఓ డి.రమేష్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిపిఎం బి.పద్మావతి, బిసి, ఎస్‌సి సంఘాల నాయకులు ముద్దాడ మధు, రామారావు, ఆదినారాయణ, బసవ సూర్యనారాయణ, వసతిగృహ సంక్షేమాధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.