విజయనగరంలో కరోన సమరభేరి..
Ens Balu
2
Vizianagaram
2020-11-28 17:39:19
కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటికే రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయామని, సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ ఏ ఒక్క ప్రాణం కోల్పోకుండా చూడటమే లక్ష్యంగా నేటి నుండి ఏభై రోజుల ప్రచారోద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ప్రజలందరినీ కోవిడ్‌పై అప్రమత్తం చేస్తూ జిల్లాలోకి సెకండ్ వేవ్ ప్రవేశించకుండా నిరోధించడమే లక్ష్యంగా మాస్కే కవచం పేరుతో అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ప్రచారోద్యమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏభై రోజుల్లో గ్రామం నుండి మండల, జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజూ చేపడుతూ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో వుండే లబ్దిదారులు, ప్రజానీకానికి అవగాహన కల్పించే బాధ్యతలు చేపట్టాల్సి వుంటుందన్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో యూరప్ దేశాలు, అమెరికాతో పాటు మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల ఉధృతి పెరిగిందని రెండో వేవ్‌లో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ప్రభావం చూపుతోందని పేర్కొంటూ సెకండ్ వేవ్‌లో ఈ వ్యాధికి గురయ్యే వారు త్వరగా మృత్యువాత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందువల్ల జిల్లా ప్రజలంతా జిల్లా యంత్రాంగం చేసే సూచనలు పాటిస్తూ తాము ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఏభై రోజుల ప్రచారోద్యమంపై చర్చించే నిమిత్తం శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ ఒక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు ఈ ప్రచారోద్యమం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ముప్పు పూర్తిగా తొలగిపోయిందనే భావన నెలకొందని, అయితే సెకండ్ వేవ్ ద్వారా తలెత్తే ముప్పును వారికి తెలియజేసి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించేలా అప్రమత్తం చేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన పదిహేను అంశాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ శాఖ తమ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించి అందజేయాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అప్పటివరకు రెండో వేవ్‌ను అడ్డుకొని ప్రజల ప్రాణాలను రక్షించాల్సి వుందన్నారు. జిల్లా యంత్రాంగంలోని గ్రామ, వార్డు వలంటీరు నుండి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరూ మనస్ఫూర్తిగా ఇందులో పనిచేయాలన్నారు. మునిసిపాలిటీల్లో ప్రత్యేక ప్రచార వాహనాలు ఏర్పాటుచేసి కోవిడ్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇకపై కేవలం కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలనే చేస్తారని, రేపిడ్ ఏంటిజెన్ పరీక్షలు, ట్రూనాట్ పరీక్షలు ఇకపై చేయబోరని చెప్పారు. ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు చేసే సామర్ధ్యం పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయుల్లో కోవిడ్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సి వుందన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ తాము చేపట్టిన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేయాలని చెప్పారు. ఉత్తమంగా డాక్యుమెంటేషన్ చేసిన ప్రభుత్వ శాఖలకు అవార్డులు ప్రకటిస్తామన్నారు. ప్రచారోద్యమంలో ఉత్తమ పనితీరు కనబరచిన ప్రభుత్వ శాఖలకు బహుమతులు ప్రకటిస్తామని వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి ఏభై రోజుల ప్రచారోద్యమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం తదితర పదిహేను అంశాలను ప్రతిఒక్కరూ పాటించాలని పేర్కొంటూ వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. మాస్కును ఏవిధంగా వినియోగించాలి వంటి అంశాలన్నింటినీ వివరిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డా.జి.నాగభూషణరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.