ప్రభుత్వ పథకాలు తక్షణమే అమలుచేయాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-11-28 17:41:45
ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, బ్యాంకర్లు, డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలు, ఇతర జిల్లా అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ క్రియాశీల కార్యక్రమాలన్నింటిని పక్కాగ అమలు చేయాలన్నారు. అర్హత గల ప్రతీ లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలని ఆయన ఆదేశించారు. అందుకు బ్యాంకర్లంతా సహకరించాలని, ఆలాగే బ్యాంకు లింకేజి, జగనన్న తోడు, సున్నా వడ్డీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆసరా, వైయస్ఆర్ చేయూత, తదితర పథకాలపై ఆయన సుదీర్ఝంగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే విడుదల చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలలో రాష్ట్రంలో విశాఖపట్నం ముందంజలో ఉండాలన్నారు. అర్హత గల ప్రతీ లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలని స్పష్టం చేశారు. వై.యస్.ఆర్. భీమా కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలకు తెలియజేయాలని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి లబ్దిదారులకు త్వరితగతిన ఋణాలు అందచేయాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోనే లబ్దిదారులకు జగనన్న తోడు పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెళ్ళి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామానులు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకం కింద్రకు వస్తారని, జగనన్నతోడు పథకంనకు సంబంధించి అర్హత గల లబ్దిదారులు దరఖాస్తు చేసుకోకపోతే అలాంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి ఒక నెల రోజులు సమయం ఇచ్చారని, నెల రోజుల కంటే ముందుగానే ఒక వారం రోజుల సమయం పాటు ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2, పిడిలు దృష్టి సారించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ మంజూరైన ప్రభుత్వ పథకాలను సత్వరమే లబ్దిదారులకు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరారు. ట్రక్కులను మంజూరు చేయడం జరుగుతుందని ఆ వాహనాలకు ఋణాలు ఇవ్వాలని తెలిపారు. డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలు వై.యస్.ఆర్. భీమాకు సంబందించి డేటా అప్డేషన్, తదితర విషయాలపై బ్యాంకర్లకు వివరించారు. అవసరమైతే తమ సిబ్బందిని బ్యాంకులలో ఏర్పాటుకు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. వైయస్ఆర్ చేయూతకు సంబంధించి పశు సంవర్థక శాఖ జెడి రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం కింద గొర్రెలు, మేకలు, తదితరమైన వాటిని మంజూరు చేయవచ్చునని, ఇందుకోసం ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక అసిస్టెంట్ ఉంటారని ఆయన అన్నారు. పశువులకు జియో ట్యాగింగ్ ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖ జెడి లీలావతి సున్నా వడ్డీకి సంబంధించి వివరించారు. సున్నా వడ్డీకి సంబంధించి ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మత్య్సశాఖ జె.డి. డా. ఫణి ప్రకాష్ కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడమైనదని, వాటిని లబ్దిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.సి. బి.సి., మైనార్టీ, ఇ.బి.సి. కార్పొరేషన్ లకు సంబంధించి ట్రక్కుల ద్వారా పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యవసర సరకులను రవాణా చేసేందుకు లబ్దిదారులకు మంజూరు చేయనున్నామని, అందుకు బ్యాంకర్లు సహకరించాలని ఇ.డి.లు కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి సరోజని, ఎల్.డి.ఎం. శ్రీనాథ్ ప్రసాద్, ఎస్సీ, బిసి, ఇబిసి, మైనార్టీ కార్పొరేషన్ల ఇడిలు శోభారాణి, పెంటోజిరావు, ఆయా బ్యాంకర్ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.