సారిపల్లిని భూ నిర్వాసిత చట్టం పరిధిలోకి..


Ens Balu
2
Vizianagaram
2020-11-28 19:13:12

విజయనగరం జిల్లాలోని తారకరామ రిజర్వాయర్ పరిసర గ్రామమైన సారిపల్లిని భూ నిర్వాసిత చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు పరిశీలిస్తామని కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేసిన కోరాడపేట, తోటాడపేట, ఎ.టి.అగ్రహారం గ్రామాల మాదిరిగానే సమీపంలో ఉన్న సారిపల్లి గ్రామానికి కూడా అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు, ఆర్ & ఆర్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు పరిశీలిస్తామని పేర్కొన్నారు. తారకరామ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్షేందుకు శనివారం కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సారిపల్లి గ్రామాన్ని ఆర్ & ఆర్ పరిధిలోకి తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తామని, అక్కడ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడున్న మొత్తం 1400 కుటుంబాలకు గతంలో చేసిన సర్వే లెక్కల ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నివాస స్థలాలు ఇచ్చే అంశాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని, నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సారిపల్లి లో ప్రస్తుతమున్న తాజా పరిస్థితిపై నివేదిక అందజేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్ లను ఆదేశించారు. ప్రభావితం అయ్యే రిజర్వాయర్  పరిధిలోని కొరాడపేట, తోటాడపేట, ఎ.టి.అగ్రహారం ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సారిపల్లి గ్రామం ప్రాజెక్ట్ పరిధిలోకి రానప్పటికీ అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై, సమస్యలపై పరిశీలన చేసి పి.ఎ.ఎఫ్. జాబితా పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత కమిటీ ఇచ్చిన నివేదికను పునఃపరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పునరావాస చట్టం 2005 ప్రకారం కాకుండా 2013 చట్టం ప్రకారం ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పగా వీలుంటే తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. వీలైనంత త్వరగా ప్రభుత్వపరంగా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను సారిపల్లి గ్రామ ప్రజలకు అందజేయాలని, భూ నిర్వాసిత జాబితాలోకి తీసుకొచ్చి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కోరారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతంలో మరడపాలెం, పోలిపల్లి గ్రామాలకు చెందిన మరొక 40 మందిని నిర్వాసిత జాబితాలో చేర్చాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే కోరారు.  సమావేశంలో జేసీ కిషోర్ కుమార్, డి.ఆర్. వో. గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, సాగునీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.