జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపే లక్ష్యం..
Ens Balu
2
Vizianagaram
2020-11-28 19:16:27
విజయనగరం జిల్లాలో చేపట్టిన జలసంరక్షణ, రక్తదానం, హరిత విజయనగరం కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్న తపనతోనే చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. స్కోచ్ అవార్డులు గాని, జాతీయ జలశక్తి అవార్డు గాని, నిన్న ప్రకటించిన ఇండియన్ ఎచీవర్స్ అవార్డు గాని తన ఒక్కడికే కాదని, ఇది జిల్లాకు, జిల్లా యంత్రాంగంలో పనిచేసే ప్రతి అధికారికి లభించిన గుర్తింపుగా భావించాలన్నారు. జిల్లాకు ఇండియన్ ఎచీవర్స్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఈ దిశగా సహకరించిన జిల్లా అధికారులందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌పై ప్రచారోద్యమం నిర్వహణకు శనివారం నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులంతా ఒక టీమ్ వర్కుతో పనిచేయడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలు ఎవరు చేపట్టినా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంటూ నగరంలోని పలు పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఇప్పటికీ మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని నగర పాలకసంస్థ, సామాజిక అటవీ విభాగాల ద్వారా అందిస్తున్నామని, అయినా కొందరు తమ పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు తగిన స్థలం ఉన్నా ఆసక్తి చూపడం లేదన్నారు. అటువంటి వారిని గుర్తించి రానున్న రోజుల్లో చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమన్నారు. ప్రదీప్ నగర్ స్కూలులో ఎంతో స్థలం అందుబాటులో ఉన్నా అక్కడ మొక్కలు నాటకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.