నదుల్లో కార్తీక పౌర్ణమి స్నానాలు వద్దు..


Ens Balu
3
Srikakulam
2020-11-28 19:48:08

సముద్రం, నదులు, చెరువులు, ఈత కొలనులలో కార్తీక స్నానాలు చేసే ప్రయత్నం చేయరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కరోనా వ్యాప్తిలోనే ఉందని, మూకుమ్మడిగా భక్తులు గుమిగూడటం ద్వారా వ్యాప్తి పెరుగుతుందని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్తీక మాసం అచరణపై ప్రభుత్వం శని వారం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం అత్యావశ్యమని ఆయన అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం, నదులు, చెరువులు, ఈత కొలనులు, బావుల వద్ద కార్తీక స్నానాలు ఆచరించవద్దని పిలుపునిచ్చారు. ఆలయాల గర్భగుడిలోకి ఎవరికి ప్రవేశం కల్పించరాదని అన్నారు. ఆలయాల్లో 10 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులు, 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కూడా అనుమతించరాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో రద్దీ ఉండరాదని, ఆలయాల్లో నిర్వహించే సేవలు సైతం ఆలయ అర్చకులు మాత్రమే పూర్తి చేయాలని, భక్తులకు అనుమతించరాదని స్పష్టం చేసారు. కరోనా తగ్గిందనే భావన వద్దని ఆయన సూచించారు. చలికాలంలో వ్యాప్తికి అవకాశాలు అధికంగా ఉన్నాయని గుర్తించాలని అందుకు తగిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.