బడుగు బలహీన వర్గాల ఊపిరి జ్యోతీరావ్ ఫూలే..
Ens Balu
2
విశాఖ సీతంపేట
2020-11-28 21:36:57
భారతదేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే బిసి సంఘం విశాఖ జిల్లా బిసి సంఘం మహిళా యువజన విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు, కోలా జయలక్ష్మి, ధనుకోటి రమ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమం విశాఖ జిల్లా బిసి సంఘం ఆధ్వర్యంలో శనివారం సీతంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఊపిరి జ్యోతీరావు ఫూలే మాత్రమేనన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా 150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. అనేక పోరాటాలు సాగించి విజయాలు సాధించి వెనుకబడిన, నిమ్నజాతులకు ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. దళితులకు, వెనుకబడిన కులాలకు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి దాయకునిగా చరిత్రలో నిలుస్తారని అన్నారు. దేవదాసీ వ్యవస్థను , సతీ సహగమన దురాచారాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమాలు భారతీయ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు గురువుగా నిలిచారని రమ పేర్కొన్నారు. అనంతరం పలువురు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పూలే ఆశయ సాధనకు, బి.సిల సంక్షేమానికి, యువజన విభాగం అభివ్రుద్ధికి తమ సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసిలు పాల్గొన్నారు.