పచ్చదనంతోనే పరిపూర్ణ ఆరోగ్యం..


Ens Balu
3
Vizianagaram
2020-11-29 13:46:34

ప్రజలకు స్వచ్ఛమైన గాలి (ఆక్సీజన్), నీరు అందించటమే లక్ష్యంగా హరిత విజయనగరం బృందం, జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తున్నాయని కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పచ్చదనం- పరిరక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు, విజయనగరం నగర పరిధిలోని 1.40 లక్షలు మొక్కలు నాటామని తెలిపారు. దండుమారమ్మ ఆలయం సమీపంలో.. నూతనంగా నిర్మించిన ఫైనాన్షియల్ కార్యాలయ సమూహం ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కులో హరిత విజయనగరం బృంద సభ్యులతో కలిసి ఆయన ఆదివారం మొక్కలు నాటారు. వాటి సంరక్షణ నిమిత్తం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే   మహాభాగ్యంగా ఇటు అధికార యంత్రాంగం, అటు హరిత విజయనగరం బృందం పని చేస్తున్నాయని చెప్పారు. రానున్న రెండు మూడేళ్ళలో మంచి ఫలితాలు చవి చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో ప్రజలు అధికారులు పాలుపంచుకోవడం చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. జిల్లాలో పలు చెరువులు అభివృద్ధి చేశామని, వాటి చుట్టూ వివిధ రకాల మొక్కలు నాటి రక్షణ కవచాలు ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా గుర్తు  చేశారు. ఇలా చేయటం వల్ల నీటి వనరులు పెరుగుతాయని, వేసవిలో నీటి ఎద్దడి కూడా ఉండదని పేర్కొన్నారు. గాలి, నీరు స్వచ్ఛంగా ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. అనంతరం పార్కును పరిశీలించి, అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. భవిష్యత్తులో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలను దానికి తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే స్థానిక ఏసీబీ కార్యాలయం నుంచి ఎస్.కోట మెయిన్ రోడ్ వరకు రోడ్డుకిరవైపులా మొక్కలు నాటి పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.