మంత్రాలయం ఘాట్ కి పోటెత్తిన భక్తులు..
Ens Balu
2
మంత్రాలయం
2020-11-29 16:32:02
కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర పుష్కరాలలో 10వ రోజైన ఆదివారం మంత్రాలయం తీరం భక్తజన సందోహంతో నిండిపోయింది. తుంగభద్ర పుష్కరాలతో పాటు ఆదివారం సెలవు రోజు కావడం, కార్తీక పౌర్ణమి కూడా ఒకే రోజు కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున మంత్రాలయంకు తరలి వచ్చారు. ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లలో భక్తుల కోలాహలంతో సందడి నెలకొంది. మంత్రాలయంలోని పుష్కర ఘాట్ లలో ఆదివారం ఉదయం నుంచి నుంచి భక్తులు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షవర్ ల కింద జల్లు స్నానం చేసి తుంగభద్రమ్మ నదీమ తల్లి వద్ద దీపాలు వెలిగించి నమస్కారాలు చేసుకున్నారు. తుంగభద్ర పుష్కరాలలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కావడంతో తమ పెద్దలకు ఎక్కువమంది భక్తులు పిండప్రదానాలు చేశారు. కర్ణాటక లోని బెంగళూరు, రాయచూరు, బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు తరలి రావడంతో పుష్కర ఘాట్ లు అన్నీ కిటకిటలాడాయి. పుష్కర ఘాట్ లలో తమ కుటుంబ సభ్యులతో సహా హాజరైన యువత సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు .. తుంగభద్ర పుష్కారాల్లో జల్లు స్నానం అనంతరం మంత్రాలయం మఠంలో వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు రాఘవేంద్ర స్వామిని ప్రశాంత వాతావరణంలో భక్తులు దర్శించుకున్నారు. తుంగభద్ర పుష్కరాలు మరియు పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కావడంతో ఆదోని ఆర్డీఓ రామకృష్ణరెడ్డి తన కుటుంబంతో సహా మంత్రాలయంలోని వి ఐపి ఘాట్ లో పుష్కర సాంప్రదాయ పూజలు చేశారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.