తిరుమలలో ఘనంగా కార్తీక దీపోత్సవం..
Ens Balu
2
Tirumala
2020-11-29 21:02:33
తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. ఆ తరువాత వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర,
వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద నేతిదీపాలను ఉంచారు. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాదీ తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమినాడు కార్తీకదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను కార్తీక దీపాల జ్యోతులు హరించి వేయాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్తీక దీపోత్సవం వెలుగుతో భక్తుల హృదయాలలో జ్ఞానజ్యోతులు వెలుగుతాయన్నారు.
ఈ కార్తీకదీపోత్సవంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు అనంత, ప్రశాంతిరెడ్డి, మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, శేఖర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాధ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విఎస్‌వో బాలిరెడ్డి, పేష్కార్ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.