రేషన్ బియ్యం నేరుగా లబ్ధిదారుని ఇంటికే..
Ens Balu
2
Machilipatnam
2020-11-30 14:09:46
పౌరసరఫరాల శాఖ ద్వారా లబ్దిదారులకు నాణ్యమైన రేషన్ బియ్యం నేరుగా వారి ఇంటి వద్దకే అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వెల్లడించారు. ప్రతి బస్తాపై క్యూ ఆర్ కోడ్, వాహనాలకు జీపీఎస్ అనుసంధిస్తారని చెప్పారు. దీంతో అక్రమాలకు ఇక తెర దించినట్లేనని మంత్రి వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లే హడావిడిలో సైతం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత స్థానిక రాజుపేటకు చెందిన ఎగ్గొని గోపీచంద్ , ఎస్.ఎన్.గొల్లపల్లి సమీప సీతారామపురం ప్రాంతానికి చెందిన పీట అనిల్ కుమార్ లు మంత్రి పేర్ని నానిని కలిసి రేషన్ కార్డుదారులకు బియ్యం డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం సంచార వాహనాలు సమకూరుస్తున్నదని తమకు ఆయా వాహనం మంజూరయ్యేలా సహాయం చేయమని అభ్యర్ధించారు. తగిన అర్హతలు ఉంటే అవి తప్పక సమకూరుతాయని తొలుత ఆయా వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్నారా అని వారిరువురిని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఏడాది జనవరి 01 తేదీ నుంచి కార్డుదారుని ఇంటికే ప్రభుత్వం అందించనున్నదని నవంబర్ మొదటి వారంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో 9 వేల 260 మొబైల్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకొందని వీటిని 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మరో 20 శాతం ఈబీసీలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తుందని, ఇక్కడ లబ్దిదారుడు కేవలం 10 శాతం భరించాల్సి ఉంటుందన్నారు. 6 ఏళ్ళ తర్వాత వాహనం లబ్దిదారుడికి సొంతం అవుతుందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని ఇందుకు అత్యాధునిక టెక్నాలజీ సైతం వాడుతున్నట్లు ఆయన చెప్పారు. పర్యావరణ హితంగా ఉండేలా పునర్వినియోగ బ్యాగును బియ్యంతో పాటు పంపిణీ చేస్తారని మంత్రి వివరించారు. వాహనంలో తీసుకెళ్లే బియ్యం బస్తాలకు టాంపర్ ఫ్రూఫ్ స్ట్రిప్ సీల్‌తో పాటు, ఆ బ్యాగ్‌పై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని ,దీని వల్ల ఎక్కడా ఆ బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉండదని మంత్రి పేర్ని నాని తెలిపారు.