గురజాడ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తాం..
Ens Balu
3
Vizianagaram
2020-11-30 16:03:26
మహాకవి గురజాడ అప్పారావు స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు అన్నారు. సోమవారం గురజాడ వర్థంతి సందర్భంగా అధికారులు, పట్టణ ప్రముఖులు మహాకవికి ఘనంగా నివాళులర్పించారు. గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి, విగ్రహానికి జాయింట్ కలెక్టర్ వెంకటరావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, డిపిఆర్ఓ డి.రమేష్, సాయిఫౌండేషన్ ప్రతినిధి కోలగట్ల శ్రావణి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు పి.వి.నర్సింహరాజు, డాక్టర్ ఏ.గోపాలరావు, కె.ప్రకాష్ తోబాటు, భీశెట్టి బాబ్జి తదితర పలువురు ప్రముఖులు, కవులు, గురజాడ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ రచయిత డాక్టర్ ఏ.గోపాలరావు రచించిన గురుజాడల గురజాడ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సత్య జంక్షన్‌లోని గురజాడ విగ్రహం వరకూ మహాకవి వినియోగించిన వస్తువులతో ర్యాలీ నిర్వహించారు. అక్కడి గురజాడ కాంస్య విగ్రహాం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జెసి వెంకటరావు మాట్లాడుతూ సాహిత్యాన్ని పండిత భాషనుంచి పామరుల చెంతకు తెచ్చిన ఘనత గురజాడ అప్పారావుకే దక్కుతుందని అన్నారు. సాహిత్యానికి వన్నె తెచ్చిన గురజాడ, విజయనగరానికి చెందినవారు కావడం మనందరకీ గర్వకారణమని, జిల్లాకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆయన సాహిత్యాన్ని, జ్ఞాపకాలను పదిలపరిచి, భావితరానికి అందించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామని అన్నారు. గురజాడ గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా గురుజాడల గురజాడ పుస్తకాన్ని రచించిన డాక్టర్ ఏ.గోపాలరావును జెసి అభినందించారు.
మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ మాట భావితరాలకు బాట అని కొనియాడారు. గురజాడ విశ్వకవి అని, ఆయన రచనలు ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గొప్ప సామాజిక స్ఫుహతో, నాటి సాంఘిక దురాచారాలపై ఆయన తన రచనలద్వారా పోరాటం చేశారని చెప్పారు. ఆనాడే మహిళల ఇబ్బందులను అర్ధం చేసుకొని, స్త్రీపాత్రలను ఉదాత్తంగా తీర్చిదిద్దారని అన్నారు. గురజాడ స్ఫూర్తిని కొనసాగించేందుకు, ఆయన రచనలను కళాశాల విద్యార్థులకు సైతం మరింత చేరువ చేయాలని సూచించారు. గురజాడ రచనలపై లేజర్‌షో ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాంస్కృతిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని ఝాన్సీ తెలిపారు. విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి, డాక్టర్ ఏ.గోపాలరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గురజాడ కుటుంబ సభ్యులు గురజాడ వెంకటేశ్వరప్రసాద్, ఇందిర, లలిత, ఆర్కియాలజి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరావు, లక్ష్మణరావు, బాలకృష్ణ తదితర కవులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.