అనంతలో 13.48% ప్రమాదాలు తగ్గుదల..
Ens Balu
2
Srikakulam
2020-11-30 17:14:26
అనంతపురం జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ (ఆర్ ఆర్ బి కే అండ్ ఆర్) నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం మినిట్స్ పై తీసుకున్న చర్యలపై చైర్మన్ కు వివరించారు.అలాగే సమావేశంలో చర్చించవలసిన అజెండా ఐటమ్స్ లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అంశాల వారీగా జెసి సమీక్షించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రి పెనుగొండలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సిందిగా మరోసారి వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి లేఖ రాయాల్సిందిగా ఆయన సూచించారు.
జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో పాఠశాలల బస్సులు, ఆటోలలో అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువ మంది విద్యార్థులతో వెళ్లకుండా చూడాలన్నారు .అందుకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు, కాలేజీలకు అధిక లోడుతో వచ్చే ఆటోలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారించేలా సంబంధిత యాజమాన్యం వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేసేలా విద్యాశాఖ సర్క్యులర్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు .ఇందుకు సంబంధించి 2020 అక్టోబర్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ 21 నందు పేర్కొన్న ముప్పై ఒక్క అంశాలపై విధించే జరిమానాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్ ,డిగ్రీ చదివే విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ బైక్ లు నడుపరాదన్నారు. లైసెన్సు లేకుండాబైకులు నడిపితే ఆ విద్యార్థులను గుర్తించి వారికి మరియు వారి తల్లిదండ్రులకు విధించే శిక్షలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు గురించి సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ లు వారి తల్లిదండ్రులకు వ్రాత మూలకంగా తెలియ చెప్పాలన్నారు. కొత్త చట్టం పై పోస్టర్లను రూపొందించి ప్రతి ఒక్క కాలేజీ వద్ద ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
మోటారు వాహన చట్టంలో సూచించిన మేరకు వాహనాల డిజైన్ ఉండాలన్నారు. అలాకాకుండా అందుకు విరుద్ధంగా అదనపు హంగులు వాహనాలకు చేర్చటం వలన ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వాహనాల్లో ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటుచేసిన స్పెన్సర్ పనిచేయవన్నారు. తద్వారా ఎయిర్ బ్యాగులు తెరచుకోకుండా వాహనాలలోని వ్యక్తులు ప్రమాద బారిన పడటమే కాకుండా, అధిక ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
పోలీసు మరియు రవాణా శాఖచే అక్టోబర్ 30 వరకు నిర్వహించిన తనిఖీలలో తక్కువ వయస్సు గల విద్యార్థులు నడుపుతున్న వాహనాలకు ,ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై, సీట్ బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా, అధిక లోడు, అధిక వేగంతో ,సెల్ఫోన్ డ్రైవ్ చేస్తూ, రాంగ్ పార్కింగ్,లైసెన్స్ లేనివారు, మోటార్ వాహన చట్టాలను ఉల్లంఘించిన 4,53,575 మందిపై కేసులనునమోదు చేసి సుమారు 11 కోట్ల 25 లక్షల రూపాయలను జరిమానాలు విధించడం జరిగిందన్నారు .సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రమాదాలు, మృతులు ఐదు శాతం మేర తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు.ఆ మేరకు జిల్లాలో 2019 వ సంవత్సరం లో 979 ప్రమాదాలు జరుగగా, 506 మంది చనిపోయారని, 1333 మంది గాయపడ్డారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు 847 మంది ప్రమాద బారిన పడగా, 468 మంది చనిపోయారని, 981 మంది గాయపడ్డారని తెలిపారు .గత ఏడాదితో పోల్చుకుంటే ప్రమాదాలు 13.48శాతానికి తగ్గాయని, మరణాలు 7.51 శాతం, గాయాలు తగిలినవారు 26.41 శాతానికి తగ్గిందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె వి ఆర్ కే ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు ,డీఎంహెచ్వో డా. కామేశ్వర ప్రసాద్ ,డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ నాధ్, సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ డా.రామస్వామి నాయక్ ,డీఈవో శామ్యూల్ ,నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి ,అనంతపురం, హిందూపురం ఎంవీఐలు వరప్రసాద్, రమేష్ , ఆర్ అండ్ బి,అనంతపురం ,ధర్మవరం ఈఈలు సంజీవయ్య ,రాజగోపాల్ ,లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ ,ఆర్డిటి చైర్మన్ తిప్పేస్వామి ,ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆర్ ఆదోని, రవాణా శాఖ ఏవో వెంకటకుమార్ ,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.