విజయనగరాన్ని గ్రీన్ జోన్ లోకి తీసుకువస్తాం..
Ens Balu
2
Vizianagaram
2020-11-30 17:21:04
విజయనగరం జిల్లాలో కోవిడ్-19ను పూర్తిగా అదుపుచేసి డిసెంబరు చివరికి జిల్లాను గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. దీనికి ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19పై 50 రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమంలో భాగంగా సోమవారం కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ను ఎదుర్కొనడంలో జిల్లా యంత్రాంగం ఇతర జిల్లాలకంటే మెరుగ్గా పనిచేసిందని అభినందించారు. పాజిటివిటీ రేటు, కోవిడ్ మరణాలు ఇతర జిల్లాలతో పోలిస్తే విజయనగరంలో అతితక్కువని చెప్పారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 7.4శాతం కాగా, మరణాలు కేవలం 0.5శాతం మాత్రమేనని, జిల్లాలో ఇప్పటివరకు 204 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెళ్లడించారు. ఇతర జిల్లాలకంటే జిల్లాలో రికవరీ రేటు కూడా అత్యధికంగా 99శాతం ఉందన్నారు. వివిధ శాఖల సమన్వయంతో, పటిష్టమైన ప్రణాళికతో చేపట్టిన కార్యాచరణ ఫలితంగా ఈ వ్యాధిని గణనీయంగా అదుపుచేయగలిగామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5,54,059 కోవిడ్ పరీక్షలను నిర్వహించగా, 40,784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 154 మాత్రమే ఉందన్నారు. అయినప్పటికీ రోజుకు సుమారు 4వేల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఇకనుంచీ ఖచ్చితంగా వ్యాధిని నిర్ధారించే ఆర్‌టిపిసిఆర్ టెస్టులను మాత్రమే చేయనున్నామని తెలిపారు. కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను కూడా ప్రస్తుతం రెండింటికి మాత్రమే పరిమితం చేశామన్నారు.
ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నప్పటికీ, ప్రజలంతా ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరభారతదేశంలో, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్ రెండోదశ మొదలయ్యిందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను సబ్బుతో గానీ, శానిటైజర్‌తో గానీ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన 15 కోవిడ్ నిబంధనలను ప్రతీఒక్కరూ పాటించాలంటూ వాటిని వివరించారు. ఇప్పటికే సాధారణ కార్యక్రమాలన్నీ మొదలైపోయాయని, ప్రజాజీవనం ఎప్పటిలాగే మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలను తీసుకున్నామని, ఉపాధ్యాయులందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహించామని చెప్పారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో కూడా కోవిడ్ నిబంధనలను పాటించేవిధంగా ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం స్వలప్పంగా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించేసి జిల్లాను గ్రీన్‌జోన్‌గా మార్చడం, రెండో దశ మొదలవ్వకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో 37 శాఖల సమన్వయంతో 50రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రామ్మోహనరావు, పిఓడిటి డాక్టర్ బాల మురళీకృష్ణ పాల్గొన్నారు.