సమస్య పరిష్కరించకపోతే పెనాల్టీ వేస్తాం..
Ens Balu
2
జివిఎంసీ కార్యాలయం
2020-11-30 19:53:48
జివిఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాధికారులు వార్డు సచివాలయాలను తరచుగా తనిఖీలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. సోమవారం తమ చాంబర్ నుంచి జోనల్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్దేశానుసారం పలు సంక్షేమ కార్యక్రమాలు తెలిపే సూచికలను, పోస్టర్లను, జాబితాలను సంక్షేమ పధకాల వారీగా, ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. 572 సచివాలయాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి చెక్ లిస్టులను గురువారం నాటికి జోనల్ కమిషనర్లు దృవీకరణతో సమర్పించాలని సూచించారు. జివిఎంసి పరిధిలో గల సచివాలయాలు రేషనలైజేషన్ చేసి, గృహాల సముదాయాలను, ప్రజలను మ్యాపింగ్ చేసి బుదవారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపల్ పరిపాలనా శాఖ, స్పందన పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రజా సర్వీసు దరఖాస్తులను నిర్ణీత సమయం దాటిన తరువాత పరిష్కారాలు 57శాతంగా నమోదు అవుతున్నాయని, నిర్ణీత కాలవ్యవధిలో 43శాతం మాత్రమే నమోదు అవుతున్నాయి. స్వీకరించిన సర్వీసు దరఖాస్తులను నిర్ణీత సమయంలో ఇక ముందు పరిష్కరించక పొతే సంబందిత అధికారులు, సిబ్బందిపై పెనాల్టీపెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ విభాగం నందు నిర్ణీత వ్యవధి దాటిన 58 సర్వీసు దరఖాస్తులను, యు.జి.డి., నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య శాఖ, యు.సి.డి. వంటి పలు శాఖలలో పెండింగులో గల దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించి నివేదిక సమర్పించాలని అందరి విభాగాదిపతులను ఆదేశించారు.
ప్రభుత్వ అదేశాల ప్రకారం చేపడుతున్న గృహాల వారి సర్వేలో ఇంకా సుమారు నాలుగు వేల మంది వాలుంటీర్లు సర్వేలో పాల్గొనలేదని వెంటనే మొత్తం పది వేల వాలంటీర్లతో ఈ సర్వేను రెండు రోజులలో పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదివరకే ఆదేశించినట్లు అన్ని జోనల్ లో గల వివిధ కోర్టులలో పెండింగులో ఉన్న వాజ్యం పూర్తి వివరాలను వెంటనే ప్రదాన కార్యాలయమునకు సమర్పించాలని, సమాచార హక్కు చట్టం కింద స్వీకరించిన దరఖాస్తులు నిర్ణీత వ్యవధిలో పరిష్కరించి, సమాచారాన్ని దరఖాస్తుదారునకు అందించాలని, లేకపోతే సిబ్బంది పై తగు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జివిఎంసి నందున్న అన్ని ఫైల్సులను ఇ-ఆఫీసు ద్వారా మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాస రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు తో పాటు జోనల్ కార్యాలయాల నుండి జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ఇతర జోనల్ స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.