డిసెంబరు 07నుంచి వ్యర్థాలపై యుధ్దం
Ens Balu
2
విజయనగరం
2020-11-30 19:59:55
విజయనగరం జిల్లాలో డిసెంబరు 07నుంచి వ్యర్థాలపై యుధ్దం పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని 2న ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల 7వ తేదీకి మార్చడం జరిగింది. తొలిరోజు 7వ తేదీన జిల్లా స్థాయిలో, 8న మండల స్థాయిలో, 9న గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నాల్గవరోజు నుంచి 15వ రోజు వరకూ, రోజుకో ప్రభుత్వ శాఖచేత వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చివరిరోజు 21వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పారిశుధ్యం, త్రాగునీటి విషయాల్లో ప్రజా చైతన్యాన్ని కల్పించి, వారి దృక్ఫథాన్ని మార్చడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సంకల్పించింది. దీనిలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తారు. రక్షిత మంచినీటి ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములై, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.