పారదర్శకతతో మెరుగైన ఇసుక విధానం..


Ens Balu
3
Machilipatnam
2020-12-01 18:22:48

వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో మెరుగైన ఇసుక విధానం అమలుకు జగన్ ప్రభుత్వం త్వరలో సిద్ధం కానుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండవరోజున హాజరయ్యేందుకు ఆయన విజయవాడకు వెళ్లే హడావిడిలో సైతం మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత బందరు బృందావనపుర తాపీ పనివారల సంఘం నాయకులు మంత్రి పేర్ని నానిను కల్సి గత ఆదివారం ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. భవన నిర్మాణ రంగంలో ఇసుక ఎంతో కీలకమని, కొందరు ఇసుకను అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు ప్రైవేట్ వ్యాపారులు 18 టన్నుల లారీ ఇసుకను మచిలీపట్నంలో కొందరు 23 వేల రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో ఇసుకను కొనలేక పలువురు యజమానులు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని దాంతో తాము పలు ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్నట్లు మంత్రి వద్ద మొర పెట్టుకొన్నారు. అలాగే లంకపల్లి ఇసుక రీచ్ ఆన్లైన్ లో నమోదు చేసుకుందామంటే ఓపెన్ కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాలపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఎవరైతే ఇసుకను అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారో వారి సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పనులకు టన్ను ఇసుక 800 రూపాయల ధరకు అమ్మేలా వారిపై నిబంధన విధిస్తామని ఆయన అన్నారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని ఇటీవల సీఎం వైయస్‌.జగన్‌ నిర్ణయం తీసుకొన్నారని చెబుతూ, ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. ఇకపై జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని ఇటీవల కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇసుకను ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే.. వారిని వెంటనే జైలుకు పంపేలా చట్టం రూపుదిద్దుకోనుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వివరణకు బృందావపుర తాపీపనివార సంఘ నాయకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇసుక లబ్యమైతే తమకు పనులు పుంజుకుంటాయని దాంతో తమ ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ అధ్యక్షులు వేమూరి గంగయ్య, కార్యదర్శి రమణ, సి ఐ టి యు రూరల్ సెక్రటరీ జయరావు కె. వి. గోపాలరావు, అందే శ్రీనివాసరావు, రాగం ధర్మరాజు, బి. వీరబాబు, బి. వాసు తదితరులు ఉన్నారు.